విజయవాడ పార్లమెంటు స్థానం విషయంలో టీడీపీలో నెలకొన్న విభేదాలకు చెక్ పెడుతూ.. ఆ పార్టీ అధి నేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ ఎంపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ కీలక నాయకులు ఎంపీ నానికి సైతం చేరవేసినట్టు తెలిసింది. అంతేకాదు.. ఇటీవల ఘర్షణ జరిగిన తిరువూరు నియోజకవర్గానికి కూడా నానిని దూరం పెట్టారు.
ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ నానికి పార్టీ నేతలు సమాచారం అందించారు. దీంతో ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. తాను తిరువూరు సభకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. అదేసమయంలో వేరేవారికి విజయవాడ సీటు కేటాయించడంపై తనకు ఎలాంటి అబ్యంతరం లేదని నాని చెప్పుకొచ్చారు. అయితే అధిష్టానం నిర్ణయాన్ని మాత్రం శిరసావహిస్తానని నాని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. ఎంపీ టికెట్ వ్యవహారంపై.. కొన్నాళ్లుగా వివాదంగా మారిన విషయం తెలిసిందే.
ఎంపీ వర్సెస్ సొంత తమ్ముడి చుట్టూ రాజకీయాలు సాగాయి. ఇరువురూ బహిరంగ విమర్శలు చేసుకోకపో యినా.. అంతర్గత కుమ్ములాటలతో విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు విజయవాడలో కేడర్ అంతా కూడా ఎంపీకి దూరమయ్యారనేది తెలిసిందే. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వంటివారు ఎంపీ నానిని కొన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు తప్ప.. ఎవరికి టికెట్ ఇచ్చినా.. తమకు ఓకే అంటూ కొన్నాళ్లుగా చెబుతున్నారు. ఈ పరిణామాలకు తోడు చిన్ని నిత్యం ప్రజల్లో ఉండడం కూడా పార్టీకి కలిసి వచ్చింది.
మొత్తంగా ఎంపీ అభ్యర్థిని మారుస్తూ.. పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, దీనినిఅధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక, పార్టీ పరంగా చూసుకుంటే.. నానికి ఉన్న బలం.. ఆర్థికంగా, కేడర్ పరంగా చిన్నికి లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో రాజకీయంగా ఇది దుమారం రేపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకో వైపు నాని వైసీపీ వైపు అడుగులు వేస్తే.. ఆయనకు టికెట్ కేటాయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇదే జరిగితే.. విజయవాడ ఎంపీ సీటు మరింత గరంగరంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.