పదిరోజుల్లో మొదటి జాబితా విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ,జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపుపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్యలో చర్చలు ఫైనల్ అయినట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని ఇంతకాలం ఇద్దరు అధినేతలు బయటపెట్టలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత జాబితాను బయటపెట్టాలన్నది మొదట్లో ఇద్దరు అనుకున్నారట. అయితే ఇపుడు పరిస్థితులు మారిపోతున్నాయి.
ఎప్పుడైతే జగన్ నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారో, ఎప్పుడైతే కొందరు అభ్యర్థులను ప్రకటించేస్తున్నారో అప్పటినుండే చంద్రబాబు, పవన్ పైన కూడా అభ్యర్ధుల ప్రకటనపై ఒత్తిళ్ళు మొదలైపాయయట. పైగా చంద్రబాబు గతంలో మాట్లాడుతు అభ్యర్ధులను ముందుగానే ప్రకటించేస్తానని హామీ కూడా ఇచ్చున్నారు. దాని ప్రకారం ఇపుడు అభ్యర్ధులను ప్రకటించక తప్పేట్లులేదట. అందుకనే పొత్తుల్లో జనసేనకు కేటాయించబోయే సీట్లను, నియోజకవర్గాలను పక్కన పెట్టేసి ఖాయంగా టీడీపీ పోటీ చేయబోయే నియోజకవర్గాలను ప్రకటించాలని చంద్రబాబు అనుకున్నారు.
ఇందులో భాగంగానే పలువురు సీనియర్లతో మంతనాలు జరుపుతు, సర్వే రిపోర్టులను దగ్గర పెట్టుకుని కసరత్తు మొదలుపెట్టారు. దీని ప్రకారం మరో పది రోజుల్లో కానీ లేకపోతే సంక్రాంతి పండుగ తర్వాత కాని టీడీపీలో మొదటిజాబితా విడుదలయ్యేందుకు అవకాశముందంటున్నారు. సుమారు 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని పార్టీవర్గాల టాక్. సిట్టింగ్ ఎంఎల్ఏలకు టికెట్లు ఖాయమని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. దాని ప్రకారం 19 మందికి టికెట్లు ఖాయమన్నట్లే. కాకపోతే ఇందులో రెండు మార్పులు ఖాయమట. అవేమిటంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరికి టికెట్ లేదంటున్నారు.
ఎందుకంటే ఈ సీటును జనసేన కోరుకుంటోంది. అందుకే బుచ్చయ్యను రాజమండ్రి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు అడుగుతున్నారట. ఇక రాజమండ్రి సిటి నియోజకవర్గంలో ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవానీకి బదులుగా ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జనసేన మొదటిజాబితా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేకపోతున్నారు. ఇంతలోనే ఈ రెండుపార్టీలతో బీజేపీ కూడా చేతులు కలపబోతోందనే ప్రచారం మొదలైంది. అది కనుక ఖాయమైతే జాబితాలో మార్పులుంటాయి. అప్పుడు మొదటి జాబితా విడుదల లేటయ్యే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates