కాంగ్రెస్ లో విలీనమైన వైఎస్సార్టీపీ

అందరూ ఊహించినట్లే వైఎస్సార్టీపీకి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి రాహుల్ గాంధీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను సంతోషిస్తున్నానని ఆమె అన్నారు. ఈరోజు నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీలో భాగమైందని, కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు తమ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుందని అన్నారు.

తనతోపాటు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ సేవ చేశారని, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరిందని, ఇది రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని అన్నారు.

ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాజశేఖర్ రెడ్డి గారు కలగన్నారని, అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది అని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.