ఏపీ కాంగ్రెస్ తో కలిసి నడుస్తా: షర్మిల

ఏపీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ స్వయంగా షర్మిల ఈ విషయాన్ని వెల్లడించారు. ఇడుపులపాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి ముందు ఉంచిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

త్వరలో తన కుమారుడి పెళ్లి జరగబోతోందని, అందరి ఆశీర్వాదం కావాలని షర్మిల అన్నారు. కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నానని షర్మిల వెల్లడించారు. ఢిల్లీలో రేపు జరగబోయే సమావేశం తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని, అందుకే పోటీ నుంచి విరమించుకున్నానని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యేవని అన్నారు. కేసీర్ సర్కారును గద్దె దించడంలో తమ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు.

ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటానికి తాము చేసిన సాయం కూడా ఒక కారణమని చెప్పుకొచ్చారు. అది గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం తనను పార్టీలో చేరాలని ఆహ్వానించిందని అన్నారు. దేశంలో అతిపెద్ద లౌకికవాద పార్టీ కాంగ్రెస్ అని, ప్రతి ఒక్కరికి భద్రతను ఇచ్చే పార్టీ అదేనని చెప్పారు. షర్మిల మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కాబోయే దంపతులు వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి కూడా షర్మిల వెంట ఉన్నారు. అయితే, షర్మిల మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా మీడియా ప్రతినిధులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించడం కనిపించింది. షర్మిల ముఖానికి దగ్గరగా మైకులు పెడుతుండడంతో ఆమె స్వయంగా వాటిని పలుమార్లు కిందకు దించుకోవాల్సి వచ్చింది. అయినా సరే, కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు మైక్ లను షర్మిల ముఖానికి దగ్గరగా తీసుకు వెళ్లడంతో వారిని షర్మిల భద్రతా సిబ్బంది సున్నితంగా వారించారు.