ఏపీలో శాసనసభ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీలలోని అసంతృప్త నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో టికెట్ రాని నేతలంతా టీడీపీ, జనసేలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ టీంలో మరో వికెట్ పడింది. మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన కుమారులు జై వీర్, రత్నాకర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు, త్వరలోనే దాడి వీరభద్రరావు టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.
దాడి వీరభద్రరావు తన రాజీనామా లేఖను సీఎం జగన్ తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నానని ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు. రేపో మాపో దాడి వీరభద్రరావు తన కుమారులతో కలిసి చంద్రబాబు, లోకేశ్ లతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీలో చేరే అంశం గురించి ఆల్రెడీ చంద్రబాబుతో దాడి చర్చించారని తెలుస్తోంది. అంతకుముందు, ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది.
వాస్తవానికి దాడి 2014కి ముందు వరకు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో దాడి కీలక నేతగా వ్యవహరించి 4 సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2019లో దాడి వైసీపీలో చేరి అనకాపల్లి నుంచి బరిలోకి దిగాలని భావించినప్పటికీ జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక, తాజాగా దాడి రాజీనామాతో అనకాపల్లి జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇక, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానని అన్నారు. ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates