వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి లేదా ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో కీలక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీగా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిలతోపాటు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి రావాలని షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.
దీంతో, అదే రోజున షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ఉంచేందుకు షర్మిల ఇడుపులపాయ వెళ్లారు. అక్కడ నుంచే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరికపై అఫీషియల్ గా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరికపై షర్మిల రేపు ఢిల్లీలో అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
మరోవైపు, ఈరోజు ఉదయం తన పార్టీ నేతలతో షర్మిల సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో పార్టీ విలీనం ఖాయమని, 4వ తేదీన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని వారితో చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ కాంగ్రెస్ లో షర్మిల అడుగు పెట్టబోతున్నారు అన్న ప్రచారం వైసీపీ నేతలలో కలవరం రేపుతోంది. వైసీపీలో టికెట్ దక్కని ఆశావహులంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టిపి విలీనంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, చివరి నిమిషంలో విలీనం ప్రక్రియను వాయిదా వేసుకున్న షర్మిల కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి మద్దతునిచ్చారు. తన పార్టీ పోటీ చేస్తే 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయంపై ప్రభావం పడుతుందని, అందుకే కాంగ్రెస్ కు మద్దతిచ్చానని షర్మిల అన్నారు.