తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా! అన్నట్టుగా మారింది వైసీపీలోని ఎంపీ, ఎమ్మెల్యేల పరిస్థితి. ఇద్దరూ ఒకే పార్టీ తరఫున గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇద్దరూ ఒకే పార్లమెంటు పరిధిలోనూ ఉన్నారు. కానీ, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. ఎన్నికల్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకునే దాకా చేరుకుంది. ఆయనకు టికెట్ ఇవ్వద్దని.. ఒరంటే, కాదు, ఆయనకే టికెట్ ఇవ్వొద్దని మరొకరు ప్రచారం చేసుకునే దాకా వెళ్లింది.
వారే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఇదే నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానం చింతలపూడి ఎమ్మె ల్యే ఎలీజా. వీరిద్దరూ గత ఎన్నికలకు ముందు బాగా కలిసి తిరిగారు. ఒకరికొకరు సాయం కూడా చేసుకు న్నారు.అయితే, మధ్యలో ఎక్కడో బెడిసి కొట్టింది. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు ముసురుకున్నాయి. కీలకమైన ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు వ్యతిరేక ప్రచారాన్ని దంచికొడుతున్నారు. అంతేకాదు.. అధిష్టానానికి కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో ఏలూరు రాజకీయాలు రణరంగంగా మారాయి.
పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే ఎలీజాకే వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయించాలని ఆయన వర్గీయులు తాజాగా బహిరంగ లేఖ రాయడం రాజకీయంగా ఆసక్తి రేపింది. ఇదేసమయంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఆయన వర్గీయులపై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఎలీజాపై లేనిపోని ఆరోపణలు చేసి ఆయనకు సీటు రాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ గతంలో తన బంధువుకు జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి ఇప్పించాలని అనుకున్నారని, అయితే అది బీసీ మహిళలకు కేటాయించడంతో అప్పటి నుంచి ఎమ్మెల్యేపై ఆయన పగ పెంచుకున్నారనేది వీరి ఆరోపణ.
ఇక, నియోజకవర్గంలోని నలుగురు జడ్పీటీసీల్లో ముగ్గురు ఎస్సీలే కావడంతో వారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని ఆశ చూపి.. ఎంపీ శ్రీధర్ మోసం చేస్తున్నారనేది మరో విమర్శ. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో ఎలీజాకు టిక్కెట్ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. చింతలపూడి ఎమ్మెల్యే సీటును బలహీనమైన వ్యక్తికి ఇప్పించేలా ఎంపీతో పాటు ఆయన వర్గీయులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఎలీజా వర్గం ఆరోపిస్తోంది. ఇలా.. పార్టీలో చిచ్చు రేపే కోటగిరికి టికెట్ ఇవ్వొద్దని వారు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య వివాదంలో ఎవరో ఒకరికి వేటు పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates