రెండో వికెట్ పడుతోందా?

అధికారపార్టీలో జరుగుతున్న మార్పుల కారణంగా తొందరలోనే రెండో వికెట్ పడిపోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. రెండో వికెట్ ఎవరిదంటే ఎమ్మిగనూరు ఎంఎల్ఏ ఎర్రకోట చెన్నకేశవరెడ్డిదనే ప్రచారం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయటం లేదని ఇదివరకే ఎంఎల్ఏ ప్రకటించారు. అయితే టికెట్ తన కొడుక్కి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని అడిగారు. అందుకు ఇపుడు జగన్ నో చెప్పారట. దాంతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఒకటిరెండు రోజుల్లోనే తన మద్దతుదారులతో భేటీ అవబోతున్నారట. ఇప్పటికే మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో చెన్నకేశవరెడ్డికి బదులుగా మాజీ ఎంపీ బుట్టారేణుకకు టికెట్ ఇచ్చే విషయాన్ని జగన్ పరిశీలిస్తున్నారు. చేనేతలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఎమ్మిగనూరు కూడా ఒకటి. చేనేత సామాజికవర్గానికే చెందిన బుట్టాకు ఎమ్మిగనూరులో టికెట్ ఇస్తే గెలుపు గ్యారెంటీ అని జగన్ అనుకుంటున్నారు. చేయించిన సర్వేల్లో కూడా అదే తేలిందని పార్టీవర్గాలంటున్నాయి. వీళ్ళిద్దరితో పాటు మరో నేత రుద్రగౌడ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

రుద్రగౌడ్ కు ఎంఎల్ఏకు ఏమాత్రం పడటంలేదు. అయితే మధ్యేమార్గంగా బుట్టాకు గనుక టికెట్ ఇస్తే తాను మద్దతిస్తానని జగన్ తో గౌడ్ చెప్పినట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. అందుకనే బుట్టాకే టికెట్ ఖాయమయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ కారణంగానే పార్టీలో ఉండి ఎలాంటి లాభం లేదని అర్ధమైపోయిన చెన్నకేశవరెడ్డి తొందరలోనే రాజీనామా చేసేయాలని అనుకున్నారట. వైసీపీకి రాజీనామా చేయబోతున్న ఎంఎల్ఏ తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఎంఎల్ఏ టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎంఎల్ఏల అనుచరుల్లో ఎక్కువమంది బుట్టాతో టచ్ లోకి వెళ్ళుతున్నారట. ఎంఎల్ఏ పార్టీని వదిలేసినా తాము మాత్రం పార్టీలోనే ఉంటామని, అభ్యర్ధి గెలుపుకు సహకరిస్తామని మాటిస్తున్నారట. దాంతో బుట్టాలో గెలుపుపై నమ్మకం పెరిగిపోతోంది. టీడీపీలో నుండి వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చిన బుట్టా ఇంతకాలం ఓపికగా వెయిట్ చేసినందుకు టికెట్ రూపంలో ఫలితం దక్కబోతోందా అనిపిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.