ఈనెలాఖరులోగా మరో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తేవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. పథకం అమలుకు విధివిధానాలను రెడీచేయాలని ఉన్నతాధికారులకు రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళకు నెలకు రు. 2500 ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోవటంలో భాగంగానే ఈనెలాఖరుకల్లా పథకం అమల్లోకి వచ్చేయాలన్నది రేవంత్ ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో లోక్ సభ ఎన్నికలకు నోటిపికేషన్ వచ్చే అవకాశముందనే ప్రచారం అందరికీ తెలిసిందే.
ఇప్పటికే సిక్స్ గ్యారెంటీస్ లో ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా అమల్లోకి తెచ్చింది. నెలకు రు. 2500 సాయం కూడా అమల్లోకి తేస్తే మూడు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చినట్లవుతుంది. పై మూడింటిలో రెండు హామీలను అచ్చంగా మహిళలకోసం ఉద్దేశించే కావటం గమనార్హం. రేవంత్ ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది మహిళలున్నారు ? వీరిలో ఎంతమందికి పథకం వర్తించవచ్చు ? లబ్దిదారులకు అర్హతలు ఏమిటి ? ఖజనాపై ఎంత భారం పడుతుందన్న విషయాలపై ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సిక్స్ గ్యారెంటీస్ అమలుచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే రెండు హామీలను అమల్లోకి తెచ్చింది. ఈనెలాఖరులోగా మూడోహామీని అమలుచేయాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. మొదటి రెండు హామీల అమలుతోనే జనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సానుకూలత ఏర్పడింది.
హామీల అమలుపై బీఆర్ఎస్ ఎంత రెచ్చగొడుతున్నా ప్రభుత్వం వాళ్ళ ఉచ్చులో పడకుండా బ్యాలెన్స్ గానే ఉంది. ప్రస్తుతం ఆసరా పథకంలో మహిళలకు పెన్షన్ అందుతోంది. అయితే అందుకు 57 ఏళ్ళు నిండాలనే నిబంధనుంది. అందుకనే మహాలక్ష్మి పథకంలో వయస్సు అర్హత ఎతుండాలనే విషయమై మార్గదర్శకాలు రెడీ అవుతున్నాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంతవీలుంటే అంత మహిళల ఓట్లను ఆకర్షించటమే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మరి సిక్స్ గ్యారెంటీస్ తో పార్లమెంటు ఎన్నికల్లో ఏ మేరకు లబ్ది జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates