వచ్చే ఎన్నికల్లో విజయం కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు నుంచి పక్కా ప్లాన్‌తోనే అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన, ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా కష్టపడుతూ నే ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు సమయం వచ్చేసిన నేపథ్యంలో నియోజకవర్గాల్లో అభ్యర్థు లను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొంత మేరకు జల్లాల బాధ్యతలను కీలక నాయకులకు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
తాజాగా జిల్లాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను ఇద్దరు నుంచి ముగ్గిరికి అప్పగించాలని నిర్ణయించడం గమనార్హం. అయితే.. వీరికి ప్రత్యేకంగా ఎలాంటి డిజిగ్నేషన్ లేకున్నా.. పార్టీలో వారికి ఉన్న సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని.. గతంలోను, ప్రస్తుతంవారికి ఉన్న ప్రజాదరణను పరిశీలించి.. జిల్లాల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించడం గమనార్హం. ఈ క్రమంలో అనంతపురంలో పార్టీని గెలిపించే బాధ్యతను పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులుకు అప్పగించనున్నారు.
వీరు తమ తమ నియోజకవర్గాల్లోనే కాకుండా.. జనవరి రెండో వారం నుంచి జిల్లాల్లోనూ పర్యటించి కార్యకర్తలను సమాయత్తం చేయాలి. ఇక, విజయనగరంలో అశోక్‌గజపతిరాజు సహా యువనాయకుడు కిమిడి నాగార్జునలకు అప్పగించనున్నారు. ఇక, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎంపీ రామ్మోహన్‌నాయుడు సహా.. పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లకు అప్పగించను న్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ బాధ్యతలను బొండా ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలకు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇక, చిత్తూరులో పార్టీని గెలిపించే బాధ్యతను పూర్తిగా చంద్రబాబు తీసుకుంటారని తెలుస్తోంది. ఇక, గుంటూరులో నారా లోకేష్ ఇలా.. ప్రతి జిల్లాకు ఒక్కొక్కరి నుంచి ఇద్దరేసి చొప్పున కీలక నాయకులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నల్లేరుపై నడక మాదిరిగా.. పార్టీని గెలిపించుకునే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది. ఏదైనా లోపాలు ఉంటే.. సరిదిద్దేందుకు కూడా.. నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు వీరికి అప్పగించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates