మాజీ డిప్యూటీ సీఎంకి సీటు ఉన్న‌ట్టా… లేన‌ట్టా…?

వైసీపీలో మార్పులు త‌ప్ప‌డం లేదు. సీనియ‌ర్ నేత‌ల‌ను కూడా వారికి ఉన్న గ్రాఫ్‌, ప్ర‌జ‌ల్లో ఉన్న హ‌వా వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని పార్టీ అధిష్టానం మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఈ క్ర‌మంలో టికెట్ వ‌స్తుంద‌ని ఆశించిన వారికి కూడా కొంత నిరాశ త‌ప్ప‌డం లేదు. దీంతో కొంద‌రు నాయ‌కులు ఏకం గా పోటీ చేయ‌బోమ‌ని ప్ర‌కటించారు. మ‌రికొంద‌రు స‌హ‌క‌రిస్తామ‌ని అంటున్నారు. ఏదేమైనా.. వైసీపీలో కొంత గంద‌ర గోళం నెల‌కొన్న మాట అయితే.. వాస్త‌వం.

ఇదిలావుంటే.. జ‌గ‌న్ అంటే.. ప్రాణం పెట్టే నాయ‌కురాలిగా, వైఎస్ రాజ‌న్న పేరును ప‌చ్చ బొట్టు వేయిం చుకున్న మ‌హిళా నేతగా పేరున్న మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఆమెకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తారో ఇవ్వ‌రో అనే సందేహం నెల‌కొంది. ఆమెకు టికెట్ ఇవ్వ‌ద్దంటూ.. కుటుంబ స‌భ్యులు ఒక‌రు(మామ అని అంటున్నారు)  పార్టీ అధిష్టానానికి లేఖ రాసిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది.

కొన్నాళ్లుగా కుటుంబ క‌ల‌హాల‌తో ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెను రెండో ద‌ఫా మంత్రివ‌ర్గం నుంచి కూడా త‌ప్పించార‌నే చ‌ర్చ ఉంది. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమె లైమ్‌లైట్‌లో లేకుండా పోయారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల ర‌గ‌డ జ‌రుగుతోంది. ఇంత జ‌రుగుతున్నా.. ఆమె పేరు ఊరు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. పైగా.. ఆమె కుటుంబం నుంచి  పార్టీకి లేఖ వ‌చ్చిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ ఉంటుందా?  ఉండ‌దా? అనే చ‌ర్చ సాగుతోంది.

గ‌త రెండు ఎన్నిక‌ల్లోకురుపా ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న పుష్ప శ్రీవాణి.. వ‌రుస గా మూడో సారి కూడా పోటీ చేస్తార‌నే ప్ర‌చారం గ‌త ఆరు మాసాల వ‌ర‌కు బాగానే సాగింది. త‌ర్వాత‌.. ఎందు కో మంద‌గించింది. ఆమె పేరు ఊరు కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకున్నారో..లేక ఆశ‌లు వ‌దిలేసుకున్నారో తెలియ‌డం లేదనే టాక్ వినిపిస్తోంది. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.