వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రం ఎక్కేవారు ఎక్కడ ఉన్నా.. వెతికి పట్టుకుని మరీ టికెట్లు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్ర బాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత రెండు సంవత్సరాలుగా మౌనంగా ఉన్నప్పటికీ.. విజయనగరం జిల్లా గజపతుల ఆడబిడ్డకే వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీనిపై అంతర్గత కసరత్తు ముమ్మరంగా సాగుతోంది.
ఎవరు.. ? ఎందుకు?
విజయనగరం జిల్లాలోని విజయనగరం అసెంబ్లీ స్థానం అత్యంత కీలకం. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ పాగా వేసింది. వాస్తవానికి ఈ సీటు టీడీపీకి కంచుకోట. పార్టీ పెట్టి 1983 నుంచి 1999 వరకు, తర్వాత 2009, 2014లోనూ ఇక్కడ నుంచి టీడీపీనే విజయం దక్కించుకుంది. బలమైన సామాజికవర్గం అండ, కార్యకర్తల అండతో టీడీపీకి ఈ సీటు కంచుకోటగా మారింది. మరో విశేషం ఏంటంటే.. ఇన్ని సార్లు కూడా.. ఒక్క 2014లో తప్ప.. మిగిలిన ఎన్నికల్లో పూసపాటి అశోక్ గజపతిరాజే విజయం దక్కించుకున్నారు.
గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరఫున పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. అయితే.. ఇప్పుడు వైసీపీ ప్రభావం తగ్గడం.. టీడీపీకే ఇక్కడి ప్రజలు జై కొడుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు రావడంతో అశోక్ గజపతిరాజు కుమార్తె .. అదితి గజపతి రాజుకు టీడీపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ అదితి పోటీ చేశారు. అయితే. వైసీపీ వేవ్‌లో ఆయన స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ.. కొన్ని రోజులు ప్రజల్లోనే ఉన్నా.. తర్వాతవ్యక్తిగత కారణాలతో ఆమె దూరమయ్యారు.
ఇక, ఇప్పుడు ఎన్నికలకు సమయం వస్తుండడం.. పార్టీ కూడా అదితివైపు సానుకూలంగా ఉండడంతో ఆమె మళ్లీయాక్టివ్ అయ్యారు. మినీ మేనిపెస్టో సహా.. ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ’పై ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించి చంద్రబాబునాయుడును మళ్లీ ముఖ్యమంత్రిగా అందలం ఎక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి గజపతుల ఆడబిడ్డ ఏమేరకు ఇక్కడి ఓటర్ల మనసు దోచుకుంటారోచూడాలి.