2024 నూతన సంవత్సరవేళ.. రాజకీయాలు మరింతగా మలుపులు తిరుగుతున్నాయి. తమకు టికెట్ దక్కదని భావించిన వైసీపీ సిట్టింగులు.. పొలిటికల్ న్యూ ఇయర్ వేడుకలకు తెరదీశారు. సోమవారం, మంగళవారం(జనవరి 1, 2) ప్రత్యేక విందులు ఏర్పాటు చేసి.. తమ అనుచరులను ఆహ్వానించారు. అదేసమయంలో వివిధ సామాజిక వర్గాలను కూడా ఆహ్వానించారు. తద్వారా.. తమ తమ బలాలను ప్రదర్శించేందుకు ఈ వేడుకలను వేదికగా చేసుకున్నారు. వైసీపీ నేతలు విందులు, ఆత్మీయ సమావేశాలతో కేడర్‌లో జోష్ నింపే పనిలో పడ్డారు.
టికెట్ రాని అధికార పార్టీ నేతలు ఈ న్యూ ఇయర్‌ను గట్టిగా ప్లాన్ చేశారు. కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్ఠానం సీటును నిరాకరించింది. ఈ క్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నియోజకవర్గ కేంద్రంలో భారీ విందు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు మండలాల నుంచి కేడర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాలని, ఇక్కడే విందు వినోదాల్లో మునిగి తేలాలని ఆహ్వానిస్తున్నారు. తద్వారా.. తన బలం ఇదీ! అని నిరూపించుకునేందుకు చంటిబాబు ప్లాన్ చేశారు.
ఇక, పిఠాపురం, పత్తిపాడు ఎమ్మెల్యేలు కూడా ఒక రోజు(సోమవారం) విందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ నుంచి ఎంతమం దినైనా తరలించే బస్సులు ఏర్పాటు చేయడం గమనార్హం. వీరి వ్యూహం కూడా.. ఇటు వైసీపీ, అటు పొరుగు పార్టీలకు తమ బలాన్ని తెలియజేయడమే. తద్వారా.. ఎన్నికల్లో ఎలాంటి శషభిషలు లేకుండా తమకు టికెట్‌లు ఇవ్వాలనే డిమాండ్లను తెరమీదికి తీసుకురావడమే. మరోవైపు.. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా.. తన వంతుగా విందు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఇన్విటేషన్ పంపిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనే ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీతో చర్చలు ముగిశాయని.. పార్టీలో చేరడమే లాంఛనమని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ అందరికన్నా ముందే.. తన సత్తా నిరూపించేందుకు రెడీ అయ్యారు. వేల మంది అనుచరుల సమక్షంలో ఆయన తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి పొలిటికల్ న్యూ ఇయర్‌గా 2024 రికార్డు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.