ఇదొక అనూహ్య రాజకీయం. దివంగత ప్రజానేత, రైతు బాంధవుడిగా పేరొందిన వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వానికి కఠిన పరీక్ష.. కాలపరీక్ష రెండూ ఎదురు కానున్నాయి. అది కూడా వైఎస్ జన్మరాష్ట్రం ఏపీలోనే కావడం గమనార్హం. నిన్న మొన్నటి ఎన్నికల వరకు .. వైఎస్ వారసత్వం అంటే.. కేవలం ఆయన కుమారుడు జగన్ మాత్రమేఅనుకునే పరిస్థితి ఉండేది. ఇదే.. 2014, 2019లో జగన్‌కు కలిసి వచ్చిన రాజకీయ వ్యూహం. అయితే.. కాలం మారిపోయింది.
గడిచిన ఐదేళ్లలో అనేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల సమయంలో అన్న కోసం రోడ్డెక్కిన వైఎస్‌తనయ, సీఎం జగన్ సోదరి.. ఇప్పుడు వేరు కుంపటి పెట్టుకుని.. ఇదే వైఎస్ వారసురాలినని ప్రకటించుకున్న విషయంతెలిసిందే. అయితే.. అది పొరుగు రాష్ట్రం తెలంగాణకే పరిమితం అవుతుందని అందరూ భావించారు. కానీ, ఇక్కడా అనూహ్య రాజకీయమే తెరమీదికి వచ్చింది. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందంటూ.. షర్మిల కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్‌కు సహకరించారు. అయితే.. అక్కడ ఆమె ప్రభావాన్ని తెరచాటున వినియోగించుకున్న కాంగ్రెస్..ఇప్పుడు మాత్రం ఏపీలో బహిరంగంగా షర్మిల ఆయుధానికి వైఎస్ వారసత్వం పదును ప్రయోగించేందుకు రెడీ అయింది. ఇదే కనుక జరిగి.. షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రకటిస్తే.. ఏపీ బాధ్యతలు అప్పగిస్తే.. ఇక, ఏపీ రాజకీయం మరింత సెగలు కక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతేకాదు..ఈ పరిణామం ఏకంగా వైఎస్ వారసత్వం అనే వ్యవహారాన్ని కూడా కీలక మలుపు తిప్పేస్తుం దని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా ఉన్న సీఎం జగన్‌కు ఆయన సోదరి షర్మిలే.. పోటీకి రానున్నారు. తాను కూడా వైఎస్ బిడ్డనేనని.. తాను కూడా రాజకీయ వారసురాలినేని ఆమె ఏపీలోనూ ప్రచారం చేసుకునేందుకు లైన్ క్లియర్‌గా కనిపిస్తోంది.
ఇది.. వైఎస్ వారసత్వానికి కఠిన పరీక్షనే పెట్టనుందని అంటున్నారు పరిశీలకులు. అంతిమంగా నిర్ణ యించేంది ప్రజలే కనుక.. వైఎస్ వారసత్వం విషయంలో ప్రజలే ఈ పరీక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంద ని చెబుతున్నారు పరిశీలకులు. మరి ప్రజలు ఎలాంటితీర్పు ఇస్తారో చూడాలి.