బ్రేకింగ్: సీఐడీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లపై హైకోర్టులో టీడీపీ పిటిషన్

ఏపీ సీఐడీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ న్యాయ పోరాటానికి దిగింది. వీరి కార‌ణంగా.. టీడీపీ  ఇబ్బందులు ప‌డుతోంద‌ని, పార్టీని లేకుండా చేయాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు సీఐడీ, ఇంటెలిజెన్స్‌చీఫ్‌లు ఆడుతున్నార‌ని పేర్కొంటూ టీడీపీ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ క్రమంలో సీఐ డీ అధికారులు స‌హా.. ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచింది. ఈ మేర‌కు టీడీపీ నేత కిలారు రాజేష్  తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌మపై వేధింపులు ఎక్కువయ్యాయ‌ని టీడీపీ చెబుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కేసులో టీడీపీ నేత‌ కిలారు రాజేష్‌ను సాక్షిగా పేర్కొన్న సీఐడీ అధికారులు ఆయనను విచారణకు పిలిచి బెదిరించారనే ఆరోప‌ణ‌లు వున్నాయి. స్వయంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్ సీతారామారాంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారని ఆయ‌న చెబుతున్నారు.

 అసలు ఈ కేసులో సీతారామాంజనేయులకు సంబంధం లేదని ఆయినా ఆయన వ్యక్తిగతంగా చంపేస్తా మని.. వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా.. తనపై దాడికి కుట్ర చేసి..ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహించార‌ని తాజాగా కిలారు త‌న పిట‌ష‌న్‌లో పేర్కొన్నారు. త‌ను చేసిన ఆరోప‌ణ‌ల‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ తోసిపుచ్చుతున్న నేప‌థ్యంలో ఆయా ఆరోప‌ణ‌ల‌కు ఆధారాల‌ను చూపించేలా ఆదేశించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు.

కాల్ రికార్డులు, సీఐడీ ఆఫీసు సీసీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సీతారామాంజ నేయులు అత్యంత వివాదాస్పదమైన అధికారి అని పేర్కొన్నారు. గతంలో ఓ మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్నారని తెలిపారు. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే ఆయనను ట్రాప్ చేశారని చెప్పారు.  హైకోర్టు విచారణలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. వారిద్దరూ… జైలుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.