ఆయన జంపింగ్ నాయకుడు. గత టీడీపీ హయాంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. పైగా ప్రముఖ వ్యాపారి, కాంట్రాక్టరుగా కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రశిద్ధుడు కూడా. అయితే.. గత ఎన్నికల్లో ఓడిపోయిన దరిమిలా.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఆయన పదవుల కోసం వేచి చూశారు. కొన్ని రోజులు రాజ్యసభ అన్నారు. మరికొన్ని రోజులు ఎమ్మెల్సీని చేసి మంత్రిగా అవకాశం ఇస్తారని భావించారు. కానీ, ఇవేవీ దరిచేరలేదు. కేవలం వైసీపీ నాయకుడిగా మాత్రమే మిగిలిపోయారు.
ఆయనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కమ్ మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన రాఘవరావుకు.. చంద్రబాబు హయాంలో మంత్రి పదవి దక్కింది. కొన్ని ఆరోపణలు వచ్చినా.. ఆయనను ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగించారు. అయితే.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒంగోలు నుంచి ఎంపీ గా పోటీ చేశారు. ఈ క్రమంలో ఆయన ఓడిపోయారు. తర్వాత.. చంద్రబాబు పై అలకబూని(తనకు దర్శి టికెట్ ఇవ్వలేదని) వైసీపీ కండువా కప్పుకొన్నారు.
తన తమ్ముడు, తను ఇద్దరూ కూడా వైసీపీలోకి చేరారు. ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించారు. రాజ్యసభ కోసం వేచి ఉన్నారు. ఈ రెండు దక్కలేదు. ఇక, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో మరోసారి తన మనసులోఉన్న కోరికను సీఎం జగన్‌దగ్గర చెప్పుకొనేందుకు తాజాగా తాడేపల్లికి వచ్చారు. సలహాదారుతో చర్చించారు. ఈ సందర్భంగా శిద్దా విషయంలో జగన్ ఏమనుకుంటున్నారనేది సదరు సలహాదారు చెప్పుకొచ్చారు. “మీకు వేరే సీటు ఇవ్వాలని అనుకుంటున్నారు రెడీ చేసుకోండి“ అని చెప్పారు.
కానీ, శిద్దా మాత్రం తనకు ఇస్తే.. దర్శిసీటే ఇవ్వాలని.. ఇతర నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేసేది లేదని తెగేసి చెప్పారు. ఈ విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారం కూడా తీసుకున్నారు. అయితే.. బాలినేని చెప్పినా.. పని అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ముభావంగానే తిరిగి వెళ్లిపోయారు. ఆర్థికంగా స్థితిమంతుడు.. పైగా.. మంచి కేడర్ ఉంది. దీంతో వైసీపీ ఈయనను వదులు కోలేక.. అలాగని దర్శి టికెట్‌ను ఇవ్వలేక సతమతం అవుతోంది .కాగా, దర్శి టికెట్‌ను బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి సీఎంజగన్ ఖరారు చేశారనే ప్రచారం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates