సీఎం జగన్ శుక్రవారం నాడు భీమవరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను జగన్ కు విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే వారి సమస్యలను విన్న జగన్ సానుకూలంగా స్పందించారు. వారికి తక్షణ సాయం అందించి ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ ఆదేశాల ప్రకారం 9 మంది అర్జీదారులకు సాయం అందించామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. భీమవరం ఆర్డీవో కార్యాలయంలో 9 మంది అర్జీదారులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పి. ప్రశాంతి అందించారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన 9 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున రూ.9 లక్షలను అందజేశామని వెల్లడించారు.
నరసాపురం మండలం ఎల్ బి చర్ల గ్రామానికి చెందిన కడలి నాగలక్ష్మికి భూ పరిష్కారంలో లక్ష రూపాయల పరిహారం అందజేశారు. నరసాపురానికి చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణకు భర్త చనిపోవడంతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బోడ్డిపట్ల గ్రామానికి చెందిన చిల్లి సుమతికి ఆమె కుమారుడి కిడ్నీ చికిత్స లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
దెందులూరు మండలం కంతేటి దుర్గ భవానికి వైద్య ఖర్చుల కోసం రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. ఏలూరుకు చెందిన తేతలి గీతకు భర్త మరణించిన కారణంతో, పూళ్ళ గ్రామానికి చెందిన అరుగుల లాజరస్ కు ఆయన కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం, తిరుపతిపురానికి చెందిన గుడాల అపర్ణ జ్యోతికి వైద్య సహాయం నిమిత్తం, పొలసానపల్లి గ్రామానికి చెందిన కోరాడ వీర వెంకట సత్యనారాయణకు వైద్య ఖర్చులు నిమిత్తం ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates