నాకేమన్నా అయితే జగన్, భారతిలదే బాధ్యత: బీటెక్ రవి

సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులలో టీడీపీ నేత, పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై బీటెక్ రవి పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఓ కేసులో బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక, తాజాగా బీటెక్ రవికి జగన్ సర్కారు గన్ మెన్ లను తొలగించింది. ఈ నేపథ్యంలోనే బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకేమైనా జరిగితే జగన్, వైఎస్ భారతి, ఎంపీ అవినాష్ రెడ్డిలదే బాధ్యత అని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.

ఈ రోజు ఉదయం తన ఇద్దరు గన్మెన్లు వెళ్లిపోయారని, ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తానని బీటెక్ రవి చెప్పారు. తనను చంపేందుకు జగన్ కుట్ర పన్నారని, ఆ క్రమంలోనే గన్ మెన్లను తొలగించాలని ఆరోపించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ మారుస్తున్నారని, పొరపాటున తన స్థానాన్ని కూడా జగన్ మార్చుకుంటారేమోనని బీటెక్ రవి చురకలంటించారు. ఒకవేళ అదే జరిగితే జగన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే ఆయనపై పోటీ చేసేందుకు చంద్రబాబు తనకు అవకాశం ఇవ్వాలని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. జగన్ పులివెందులలో పోటీ చేయకపోతే తన పరిస్థితి ఏంటని బీటెక్ రవి చమత్కార ధోరణిలో మాట్లాడారు.

పులివెందుల ప్రజలకు జగన్ చేసిన అన్యాయం, వారి పట్ల జగన్ నిర్లక్ష్యం, వారిని అగౌరపరిచిన వ్యవహారం వంటి విషయాలను నేపథ్యంలోనే జగన్ పై తాను పోటీ చేస్తున్నానని, ఒకవేళ పులివెందుల నుంచి జగన్ పోటీ చేయకపోతే తన గతేం కాను అంటూ చమత్కరించారు. నీ సీటు నువ్వైనా మార్చుకోకుండా ఉండు అంటూ జగన్ కు బీటెక్ రవి రిక్వెస్ట్ చేశారు. మరి బీటెక్ రవి వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.