వ‌ర్మా.. ద‌మ్ముంటే ఈ సినిమాలు తీ: లోకేష్ స‌వాల్‌

టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ‘రెడ్‌బుక్‌’ను చేత్తో ప‌ట్టుకుని ప్ర‌సంగాలు చేసిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత కాలంలో ఈ రెడ్ బుక్ చుట్టూ అనే వివాదాలు.. విమ‌ర్శ‌లు.. చోటు చేసుకున్నాయి. ఇటీవ‌ల ఓ కేసులో ఏపీ సీఐడీ ఏకంగా.. రెడ్ బుక్ విష‌యాన్ని నేరుగా హైకోర్టులోనే ప్ర‌స్తావించింది. రెడ్ బుక్ పేరుతో అధికారుల‌ను నారా లోకేష్ బెదిరిస్తున్నార‌ని కోర్టుకు తెలిపింది. ఇలా.. ఇటీవ‌ల కాలంలో నారా లోకేష్ రెడ్ బుక్‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

తాజాగా ఈ రెడ్ బుక్‌పై నారా లోకేష్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో ఎవ‌రెవ‌రి పేర్లు రాస్తున్నామో ఆయ‌న వెల్ల‌డించారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్‌బుక్‌లో రాస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. తప్పు చేసిన వాళ్ల గురించి మాట్లాడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. “అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా? సీఐడీనే స్క్రిప్ట్ రాసివ్వమనండి.. అదే చదువుతా. లేదా సజ్జల వంటి వాళ్లు స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతా” అని నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వాళ్లు తప్పు చేసినట్టు అంగీకరిస్తున్నారా? అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు. ఇదిలావుంటే.. తాజాగా రాంగోపాల్ వ‌ర్మ రూపొందించిన వ్యూహం సినిమాపైనా నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “వ్యూహం చిత్రానికి ప్రతివ్యూహం ఉండకూడదంటే ఎలా. ఎన్నికలకు ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారు” అని లోకేష్ అన్నారు.

రాం గోపాల్ వ‌ర్మ‌ నిజంగా సినిమా తీయాలంటే హూకిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్‌లో జరుగుతున్న అవినీతి మీద తీయాల‌ని నారా లోకేష్ స‌వాల్ విసిరారు. మ‌రోవైపు.. ప్ర‌స్తుతం వైసీపీలో జ‌రుగుతున్న ఇంచార్జ్ ల మార్పుపైనా నారా లోకేష్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సీట్లనే వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి బీసీలకు ఇస్తున్నార‌ని అన్నారు.

“మంగళగిరిలో రెండు సార్లు రెడ్ల‌కే టికెట్‌ ఇచ్చారు. ఇప్పుడు మంగళగిరిలో ఓడిపోతున్నామని తెలిసే బీసీకి ఇచ్చారు. కడప ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వమనండి. పులివెందుల సీటు బీసీలకు ఎందుకివ్వరు?. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజనీ చెత్త అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పేశారు. చిలకలూరిపేటకు పనికి రాని విడదల రజనీ గుంటూరు వెస్ట్‌లో ఎలా పనికొస్తారు?” అని లోకేష్ నిల‌దీశారు.