వచ్చే ఎన్నికల్లో పార్టీల వ్యూహాలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉన్న లెక్క వేరు. వారసత్వాన్ని చూసి.. లేదా.. యువ నాయకుడు అనే సానుభూతి చూపి ప్రజలు గెలిపించిన పరిస్తితి ఉంది. కానీ, ఇప్పుడు వైసీపీ వేస్తున్న అడుగులు.. వీటికి భిన్నంగా ఉన్నాయి. ప్రజలను మరింతగా మెస్మరైజ్ చేసేలా ఆ పార్టీ వ్యూహాలు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ నాయకులు.. ముఖ్యంగా గెలుపు గుర్రంపై ఆశలు పెట్టుకున్నవారు మరింతగా కష్టపడాలనేది పరిశీలకుల మాట.
ఉమ్మడి అనంతపురం జిల్లా అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ ఓ మహిళా నాయకురాలిని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. పైగా కురబ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ఈమెకు వైసీపీ టికెట్ దాదాపు ఖరారు అయిపోయిందని అంటున్నారు. దీనిపై సదరు మంత్రికి కూడా పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. అంటే.. ఎమ్మెల్యే కమ్ మంత్రిగా ఉన్న ఆమె.. ఇక పార్లమెంటుకు బరిలో దిగనున్నారు.
ఇదేసమయంలో అనంతపురం పార్లమెంటు సీటు నుంచి టీడీపీ తరఫున(ఇంకా కన్ఫర్మ్ కాలేదు) వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసుకోవాలనే సూచనలు వస్తున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లో కురబ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య ను నిలబెట్టిన వైసీపీ.. పవన్‌ను ఓడించింది. ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ.. పైగా మహిళా నాయకురాలిని రంగంలోకి దింపుతోంది.
దీంతో పోరు మరింత తీవ్రంగా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్.. మునుపటికన్నా ఎక్కువగా కష్టపడక తప్పదని అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు తన తండ్రి జేపీ ప్రభాకర్‌రెడ్డి ఇమేజ్, మరోవైపు యువ నాయకుడిగా తన ఇమేజ్ ఉన్నా.. వైసీపీ పథకాలు.. మహిళా మంత్రం.. కురబ కుట ట్యాగ్ వంటివి ప్రభావం చూపించడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిని అంచనా వేసుకుని ముందుకు సాగితే.. ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు పరిశీలకులు.