టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలు రోజుకో రకమైన ట్విస్ట్ ఇస్తున్నాయి. రెండు రోజుల కిందట జాతీయ రాజకీయాల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)తో భేటీ అయిన చంద్రబాబు రాజకీయాలను సలసల మరిగేలా చేశారు. దీనిపై అనేక వందల విశ్లేషణలు.. చర్చలు.. వార్తలు వచ్చాయి. ఈ వేడి తగ్గకముందే.. ఇప్పుడు మరో సంచలనం చోటు చేసుకుంది.
ప్రస్తుతం కర్ణాటకలో పర్యటించిన చంద్రబాబు.. అక్కడి బెంగళూరులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. అనంతరం తిరిగి తన సొంత జిల్లా ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి బయలు దేరారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి రేణిగుంటకు వచ్చేందుకు విమానాశ్రయానికి వెళ్లారు. ఈ సమయంలో ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, షార్ప్ షూటర్, డిప్యూటీ సీఎం కే. శివకుమార్ తారసపడ్డారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కకు వెళ్లి మరీ చర్చించుకోవడం గమనార్హం. గతంలో 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి పనిచేసినప్పుడు డీకే శివకుమార్ ప్రచారం చేశారు. మళ్లీ ఆతర్వాత.. చంద్రబాబుతో ఆయన కనిపించలేదు.
ఇక, ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబుతో డీకే ఎదురు పడడం.. ఇద్దరూ ఏకాంతంగా విమానాశ్రయం రన్‌వేపైనే చర్చలు జరపడం ఉత్కంఠకు దారి తీశాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బలపడాలని కాంగ్రెస్ భావిస్తున్న సమయంలో.. ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మరి ఏం చర్చించుకున్నారు? ఏంటి కథ తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates