తెలుగుదేశం పార్టీలో ఓ కీలక పరిణామం జరగబోతున్నట్లు సమాచారం. ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారిన అచ్చెన్నాయుడికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా.. ఏపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు.
ఐతే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అంత యాక్టివ్‌గా లేని నేపథ్యంలో త్వరలో ఆయన స్థానంలోకి శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను తెదేపా ఇప్పటికే మండలస్థాయి వరకు దాదాపుగా పూర్తిచేసింది.
ఇకపై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించనున్నారు. వారం, పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తారని, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తిచేస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
పార్టీలోని సీనియర్లలో ఎక్కువ మంది అచ్చెన్ననే పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్న అభిప్రాయాన్ని బాబు వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది. పలు సమీకరణాల దృష్ట్యా అచ్చెన్నకు ఏపీ టీడీపీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీకి అత్యంత విధేయుల్లో ఒకడైన ఆయన.. చంద్రబాబు తర్వాత ప్రస్తుతం కీలక నేతల్లో ఒకరిగా ఉంటున్నారు.
ఇటీవల ఈఎంఐ స్కాంలో ఆరోపణలుఎదుర్కొన్నప్పటికీ.. జగన్ సర్కారు ఆయనపై కక్ష సాధింపుతో ఈ కేసులో ఇరికించిందన్న అభిప్రాయాన్ని తెదేపా బలంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించింది. ఆయనపై అభియోగాలేవీ నిలవలేదని అంటున్నారు.
మరోవైపు ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిపోవడం తప్పనిసరి అయితే.. ఉత్తరాంధ్రకు చెందిన బలమైన నేత అయిన అచ్చెన్నకు పార్టీ బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయమని భావిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడుని అధ్యక్షుడిగా నియమిస్తే స్ధానికంగా పార్టీ బలోపేతం కావడంతో పాటు ఉత్తరాంధ్రలో పునర్ వైభవం సాధించేందుకు కూడా వీలు పడుతందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates