రాజకీయాల్లో మొహమాటాలకు తావులేదు. ఉంటే ఎంత కష్టమో.. ఎన్నికల వేళ పలు పార్టీలకు అనుభవ మే. అయినా కూడా ఒక్కొక్కసారి మొహమాటం తప్పదు. ఏం చేస్తారు..? బలమైన నేతలు తారస పడిన ప్పుడు సర్దుకు పోవాల్సి ఉంటుంది. అయితే.. ఇలా సర్దుకు పోయే సందర్భంలో ఎదురయ్యే పరిణామాల ను ఎలా డీల్ చేయాలనేది కూడా కీలకమే. ఈ విషయంమే ఇప్పుడు వైసీపీకి చిక్కుగా మారింది.
దేశంలో కీలకమైన ఘట్టం మరికొన్ని రోజుల్లోనే ఆవిష్కృతం కానుంది. అదే.. యూపీలోని అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానించారు. మరోవైపు.. అయోధ్య రామజన్మ భూమి ట్రస్టు కూడా.. ఆహ్వాన పత్రికలు పంపించింది. ఈ ఆహ్వాన పత్రిక తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు కూడా అందింది.
అదే సమయంలో ప్రధాని నుంచి కబురు రానుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో సీఎం జగన్ అయోధ్యకు వెళ్లాలా? వద్దా.? అనే మీమాంస ఏర్పడింది. వెళ్తే.. ఆయనకు మైనారిటీ ఓటు బ్యాంకు ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. పైగా బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో ఇది మరింత ఎక్కువగా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు వెళ్లకపోతే.. మోడీ ఆహ్వానాన్ని ధిక్కరించారన్న చెడ్డపేరు.
వెరసి.. ఈ సమస్య నుంచి ఎలా బయటకు రావాలా? అనేది ఇప్పుడు జగన్ పడుతున్న ఆవేదన. ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు, ఢిల్లీ సీఎంలు స్టాలిన్, కేజ్రీవాల్‌లు ఇప్పటికే.. తాము ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని.. రాముడిని రాజకీయాల కు వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.