టీడీపీ యువనేత నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో వచ్చే శుక్రవారం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. సుమారు 15 రోజుల పాటు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ పాదయాత్ర నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక, ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న నారా లోకేష్.. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మారిన రాజకీయపరిణామాలపై ఆయన నాయకులతో చర్చించనున్నారు. అదేసమయంలో వైసీపీ వ్యవహారం.. ఓట్లు, రాజధాని ఎఫెక్ట్, ముఖ్యంగా యువగళం ఎఫెక్ట్ తదితర అంశాలను నారా లోకేష్ నాయకులతో మాట్లాడి తెలుసుకుంటారు. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని ఫంక్షన్ హాల్‌లో టీడీపీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగానే 15 రోజుల పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ ఏడాది జనవరి 27న యువగళం పాదయాత్ర నిర్వహించిన నారా లోకేష్.. మంగళగిరిలోనూ పాదయాత్ర చేశారు. అయితే.. ఇది మినీ బైపాస్ గుండానే పోయింది. దీంతో క్షేత్రస్థాయిలో మండలాలు, కొన్ని గ్రామాలను స్పృశించలేక పోయారు. దీంతో ఇప్పుడు అన్ని మండలాలు, గ్రామాల్లోనూ .. పాదయాత్రనిర్వహించడం ద్వారా.. అందరినీ కలుసుకుని వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.
సుమారు 15 రోజుల పాటు నిర్వహించే ఈ పాదయాత్ర నిర్విరామంగా సాగనుందని పార్టీ కీలక నాయకుడు వర్ల రామయ్య తెలిపారు. అయితే.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన నారా లోకేష్ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికలను దీటుగా ఎదుర్కొనడంతోపాటు.. మంగళగిరిలో విజయమే లక్ష్యంగా నారా లోకేష్ ఈ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ యాత్రలో యువతను ఎక్కువగా టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతారని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates