టీడీపీ-జ‌న‌సేన పొత్తును కాపు నాయ‌కులు యాక్సెప్ట్ చేయ‌లేక పోతున్నారా?

ఏపీలో వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల‌కుండా చూస్తామ‌ని చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో కాపు నాయ‌కులు ఈ పొత్తు ను అంగీక‌రించ‌లేక పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు అయితే ఖ‌రారైంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం కూడా ఖాయ‌మై పోయింది. ఇక‌, ఇప్పుడు మిగిలింది.. సీట్ల పంప‌కాలు మాత్ర‌మే. ఈ ద‌శ‌కు వ‌చ్చేసిన ఈ పొత్తు విష‌యం పై జ‌న‌సేనలో ని కాపు నాయ‌కులు ర‌గిలిపోతున్నారు.

ఇటీవ‌ల ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క జ‌న‌సేన‌ నాయ‌కులు(పెడ‌న‌, గుడివాడ కు చెందిన‌) పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ఉద్దేశించి కాపు సంక్షేమ నాయ‌కుడు, మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ జోగ‌య్య ఘాటు లేఖ రాశారు. మీపైనే ఆశ‌లు పెట్టుకున్న కాపుల‌కు.. మీరు ఏం చెబుతారు? వారి క‌ల‌లు క‌ల్ల‌లు చేస్తారా? అని నిల‌దీశారు. దీనిపై జ‌న‌సేన నుంచి ఇప్ప‌టి వ‌రకు ఎలాంటి రియాక్ష‌న్ రాలేదు. కానీ, జోగ‌య్య లేఖ తాలూకు వేడి మాత్రం కాపుల్లో కొన‌సాగుతోంది.

ఇక‌, ఈ వేడి ఇక్క‌డితో ఆగిపోవ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో మ‌రింత‌గా సెగ త‌గులుతోంది. తాజాగా ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం కీల‌క జ‌న‌సేన నాయ‌కుడు మేడా గురుద‌త్త ప్ర‌సాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ వైసీపీలో చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా మేడా మాట్లాడుతూ.. జ‌న‌సేన అధినేత పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కి కాపులని శాశించే అధికారం లేదు, కాపు ఆశయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అని అన్నారు.

అంతేకాదు.. టీడీపీ ప‌ల్ల‌కీని మోయ‌డానికి ప‌వ‌న్‌.. కాపుల‌ను ఎందుకు తాక‌ట్టు పెడుతున్నార‌ని మేడా ప్ర‌శ్నించారు. ప్రతి రాజకీయ నాయకుడు తన పార్టీ, తన నాయకులు ఎదగాలని కోరుకుంటారు. కానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం 'పక్క పార్టీ నాయకులు' ఎదగాలని కోరుకుంటున్నారు. రాష్ట్రం బాగు కంటే తనకి ఏ పదవి ముఖ్యం కాదని పదే పదే అంటున్నారు. పదవి అవసరం లేదని ఎవరితో చర్చించి చెప్పారు? నారా లోకేష్, చంద్రబాబు నిర్ణయం సరిపోతుంది అనుకుంటే, నీ వెనకాల నీ పార్టీని నమ్ముకుని తిరిగిన జనసైనికుల పరిస్థితి ఏంటి? నీ వెంట నడిచిన కాపు నాయకుల సంప్రదింపులు నీకు అవసరం లేదా? అని మేడా నిల‌దీశారు.

ఈ ప‌రిణామాల‌తో కాపులు టీడీపీ-జ‌న‌సేన పొత్తును జీర్ణించుకోలేక పోతున్నారా? అనే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.