టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం దక్కించుకునేందుకు ఆయన వ్యూహాలకు పదును పెంచుతున్నారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల వ్యూహ కర్త.. ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించడం.. నేరుగా ఆయనను ఉండవల్లికి పిలిపించుకుని చర్చిం చడం వంటిపరిణామాలు ఏపీలో రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
అయితే..చంద్రబాబు పరంగా చూసుకుంటే.. ఈ పరిణామం ప్లస్సా.. మైనస్సా.. అనేది కూడా ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో పీకే వ్యూహాలతోనే వైసీపీ విజయం దక్కించుకున్నదనే చర్చ ఉంది. అయితే.. ఎక్కడో తేడా వచ్చి.. వైసీపీ ఆయనను వదిలించుకుంది. ఈ క్రమంలోనే పీకే కూడా.. తరచుగా వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ.. నిందలు వేస్తున్నారు.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా టీడీపీ పీకే సేవలను ఆశ్రయించడంపై కొంత ప్లస్‌గాను, మరికొంత మైనస్‌గాను చర్చ సాగుతోంది. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు నిండా రెండు పదుల అనుభవం కూడా లేని పీకేను ఆశ్ర యించడాన్ని.. మేధావి వర్గాలు తప్పుపడుతున్నాయి. ఇదేసమయంలో చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలపైకూడా ఎఫెక్ట్ పడే ప్రభావం ఉందని అంటున్నాయి.
మరోవైపు.. పీకేతో చంద్రబాబు భేటీ.. ఆయన సేవల వినియోగంపై టీడీపీలో మాత్రం జోష్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా మరింత దూకుడు ప్రదర్శించేందుకు పీకే సాయం అవసరమేనన్నది టీడీపీ నాయకుల మాట. అంతేకాదు, పీకే రాకతో పార్టీ నేతలు కూడా భరోసాగా ముందుకు సాగే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా పీకే వ్యవహారంపై మిశ్రమ స్పందన లభిస్తుండడం గమనార్హం. మరి ప్రజలేం తేలుస్తారో చూడాలి.