విజయనగరం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం బొబ్బిలిలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడుపై సొంత పార్టీ నాయకులు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో క్షేత్రస్తాయి నాయకులు ఎమ్మెల్యేపై ఆగ్రహంతో పార్టీకి రాం రాం చెబుతున్నారు. ఇటీవల నియోజకవర్గ పరిధిలోని రామభద్రపురం నుంచి పలు కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరిలో ఇద్దరు సర్పంచులు కూడా ఉండటంతో ఎమ్మెల్యే శంబంగి అలెర్ట్ అయ్యారు.
జనాలతో కలవకే..
బొబ్బిలి వైసీపీలో నాయకులు పార్టీని వీడడానికి కారణం.. ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు వ్యవహరిస్తున్న తీరే కారణమని తెలుస్తోంది. ఆయన పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా అందుబాటులో ఉండరనే వాదన ఉంది. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రతిపక్షం టీడీపీ వైసీపీ నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తుండడం గమనార్హం.”ఇది ఆరంభం మాత్రమే. వివిధ మండలాల నుంచి మరిన్ని కుటుంబాలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి” అని టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబినాయన వ్యాఖ్యానించడం క్షేత్రస్థాయిలో పరిస్థితికి అద్దం పడుతోంది.
ఈ నియోజవర్గ పరిధిలో బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా జిల్లాలోని మిగిలిన మండలాల ఫలితాలు ఒక విధంగా ఉంటే బొబ్బిలి నియోజవర్గ పరిధిలో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఎంపీపీలను వైసీపీ దక్కించుకున్నా ఎంపీటీసీల గెలుపు విషయంలో ఈ నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువ మంది టీడీపీ నుంచి గెలుపొందారు. స్థానిక ఎన్నికల నుంచే ఎమ్మెల్యేపై వ్యతిరేకత కన్పిస్తూ వచ్చింది. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ఆయన్ను పలుచోట్ల ప్రజలు సమస్యలపై నిలదీశారు.
మరిన్ని వలసలు?
బొబ్బిలి పరిధిలోని బాడంగి, తెర్లాం, బొబ్బిలి మండలంలో కూడా కొంత మంది వైసీపీ సర్పంచులు టీడీపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకతే ఇందుకు కారణమని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఇక్కడ పుంజుకుంటుందని నాయకులు అంచనా వేస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates