2024 ఎల‌క్ష‌న్స్‌: చంద్ర‌బాబు ధైర్యం ఇదే… !

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచి తీరుతుంద‌ని.. ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌కు ఇటీవ‌ల కాలంలో మ‌రింత ప‌దును పెరిగింది. అది కూడా.. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రింత‌గా చంద్ర‌బాబులో ఆత్మ విశ్వాసం పుంజుకుంది. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు ధైర్యానికి కార‌ణాలు తెలుస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల‌తో పాటు.. ఈ ఏడాది మేలో జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌జ‌లు గెలిపించారు. ఈ ఏడాది మొత్తంగా .. ఏడు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో ఐదు రాష్ట్రాల్లో ప్ర‌తిప‌క్షాలు అధికారం ద‌క్కించుకున్నాయి. ఒక్క గుజ‌రాత్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ల‌లో మాత్ర‌మే అధికార పార్టీ మ‌ళ్లీ పుంజుకుంది.

తెలంగాణ‌, రాజ‌స్థాన్‌, క‌ర్ణాట‌క‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో ప్ర‌తిప‌క్షాల‌కే ప్ర‌జ‌లు అధికార పీఠాన్ని అప్ప‌గించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల విష‌యంలో ప్ర‌భుత్వాల ఉదాశీన విధానాలు కావొచ్చు.. అప్పుల కుప్ప‌లుగా రాష్ట్రాల‌ను త‌యారు చేస్తున్నార‌న్న ఆగ్ర‌హం కావొచ్చు. ఉపాధి, ఉద్యోగాల క‌ల్పన స‌హా.. పారిశ్రామిక విధానాల్లో చోటు చేసుకుంటున్న లోప‌భూయిష్ట విధానాలు కావొచ్చు. ఏదేమైనా.. అధికార పార్టీల‌కు.. ప్ర‌జ‌లు రాంరాం చెప్పారు.

మొత్తంగా చూస్తే.. ఈ ప‌రిణామం… ఇలానే కొన‌సాగితే.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక స‌మ‌రంతో పాటు.. ఏపీతో పాటు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఒడిసా, సిక్కిం, హ‌రియాణ‌, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. వీటిలోనూ తొలి నాలుగు మాసాల్లో అంటే. ఏప్రిల్‌లో ఏపీ, ఒడిశా, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, సిక్కింల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి.

ప్ర‌ధానంగా ఏపీలో కూడా ప్ర‌తిప‌క్షానికి ప్ర‌జ‌లు ప‌ట్ట‌క‌ట్టే అవ‌కాశం ఉంద‌న్న‌ది చంద్ర‌బాబు వేస్తున్న అంచ‌నా. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు దూకుడు పెంచార‌ని, గెలుపుపై ధీమాతో ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే ఆయ‌న ధైర్యానికి కార‌ణ‌మ‌ని కూడా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.