దేశంలో మోడీ ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి చట్టాలను.. అప్పటి శాసనాలను మారుస్తూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే.. ఐపీసీ.. సీఆర్ పీసీ.. వంటి కీలకమైన మూడు చట్టాలను పూర్తి గా మార్చేసి.. భారతీయతను జోడిస్తూ.. భారతీయ న్యాయసంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి చట్టాలను తీసుకువచ్చింది.(వీటిని పార్లమెంటు ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంది) ఇక, ఇప్పుడు ప్రపంచ కాలమానాన్ని మార్చే పనిపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి తాజాగా బీజేపీ ఇటీవల మరోసారి విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అసెంబ్లీ వేదికగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని ఉజ్జయిని కాలమానం చుట్టూ తిప్పుతా! అని సీఎం మోహన్ యాదవ్ తాజాగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుత కాల మానం ఇదీ..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ‘గ్రీన్‌విచ్’ కాలమానాన్ని అనుసరిస్తోంది. దీనిని బట్టే ప్రపంచ దేశాలు సమయాన్ని నిర్ణయించుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. గ్రీన్ విచ్ అనేది బ్రిటన్ దేశంలోని పారిస్‌లో ఉన్న ప్రాంతం. కాలాన్ని నిర్దేశిస్తున్న ‘ప్రైమ్ మెరిడియన్’ గ్రీన్‌విచ్ గుండా వెళ్తుందని 1884లోనే ప్రతిపాదించారు.
దీంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ విధానాన్నే అనుసరిస్తోంది. ప్రపంచ కాలానికి ‘0’ డిగ్రీల రేఖాంశం అత్యంత ముఖ్యమైనది. దీనినే ‘ప్రైమ్ మెరిడియన్’ అని పిలుస్తుంటారు. ఈ రేఖాంశం నుంచి భూమిని నిలువుగా రెండు వైపుల సమానంగా విభజిస్తున్నారు. ఈ రేఖాంశం ఇంగ్లాండ్‌లోని గ్రీన్‌విచ్ అనే ప్రాంతం గుండా వెళ్తుంది. దీంతో ప్రస్తుతం ఈ విధానాన్నే కాలానికి ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు.
సీఎం వ్యాఖ్యలు ఇవీ..
ప్రైమ్ మెరిడియన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ గుండా వెళ్తుందని, కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రపంచ కాలాన్ని మార్చడానికి తాను కృషి చేస్తానని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. “నిజానికి ప్రైమ్ మెరిడియన్ ఉజ్జయిని నుంచి వెళ్తోంది. కాబట్టి ఉజ్జయిని ప్రపంచ ప్రైమ్ మెడియన్. దీనిని అనుసరించి నేను ప్రపంచ కాలాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తా. ఉజ్జయిని చుట్టూ ప్రపంచ కాలగమనాన్ని నిర్దేశిస్తా” అని అసెంబ్లీలోనే మోహన్ యాదవ్ ప్రకటించారు.
అంతేకాదు.. 300 ఏళ్ల క్రితమే ప్రపంచ ప్రామాణిక సమయాన్ని భారతదేశం నిర్ణయించిందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో సమయాన్ని నిర్ధారించే పరికరం ఇప్పటికీ ఉందన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత రోజు ప్రారంభం కావడాన్ని ఆయన తప్పు పట్టారు. సూర్యోదయం లేదా కొంత సమయం తర్వాతే ప్రజలు మేల్కొంటారని, దానిని బట్టి రోజు మారడం అక్కడే మొదలు కావాలని వ్యాఖ్యానించారు.