“2019లో వైసీపీ కోసం కాదు.. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం చాలా కష్టపడ్డాం. ఇలా చేసి మనం చాలా పెద్ద తప్పు చేశాం“ అని వైసీపీ నుంచి కొన్నాళ్ల కిందట సస్పెన్షన్కు గురైన రెబల్ ఎమ్మెల్యే, ఇటీవల టీడీపీలో చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ఈయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించిన మేకపాటి.. మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. ‘‘నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నా గ్రాఫ్ బాగా లేదంటూ సీఎం జగన్ నన్ను కించపరిచారు. ఉదయగిరిలో నేను డబ్బు తీసుకుంటున్నానని అన్నారు. ఉదయగిరిలో ఏముందని సంపాదించడానికి? పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించా. లేనిపోని అనుమానాలతో నా టికెట్‌నే అమ్మకానికి పెట్టారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. రాష్ట్రంలో ఎటుచూసినా అభివృద్ధి అనేదే లేదు. జగన్ చుట్టూ ఉండేవారు, సలహాదారులు ఎవరికివారు దోచుకునేవాళ్లే. బటన్లు నొక్కడమే పనిగా పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎలా?“ అని నిప్పులు చెరిగారు.
నాయకుడికి తీవ్రమైన ధనదాహం ఉండకూడదన్న మేకపాటి.. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్లు ఉందని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని తాను చాలా దగ్గరగా చూశానని.. ఆయన దగ్గర కూడా పనిచేశానని చెప్పుకొచ్చారు. అయితే.. వైఎస్ కు ఉన్న గుణాలేవీ జగన్‌కు రాలేదన్నారు. ఏపీలో అక్రమ కేసులు, అన్యాయాలను ఇక భరించలేమని వ్యాఖ్యానించారు. జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరు. సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని జగన్ గ్రహించాలి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే.. అందరూ గుండు కొట్టుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates