సముద్ర తీరం వెంబడి ఉన్న కాకినాడలో రాజకీయ సునామీ ప్రారంభమైంది. అధికార పార్టీ వైసీపీ టికెట్ పై గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ముగ్గురు కీలక ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇతర పార్టీల్లో చేరేందుకు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి కారణం.. వారి గ్రాఫ్, సర్వేల ఆధారంగా.. వైసీపీ వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ కేటాయించేం దుకు నిరాకరించడమేనని తెలుస్తోంది. ఈ జాబితాలో జూనియర్లు, సీనియర్లుకూడా ఉండడంతో రాజకీయంగా కాకినాడలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
కాకినాడ జిల్లాలో ప్రధానం మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని వైసీపీ నిర్ణయించుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. దీంతో వైసీపీపై అలకబూనిన సదరు మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మాకు టికెట్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కానీ, పార్టీ మారతాం
అని వారు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పిఠాపురం: ఈ నియోజకవర్గం నుంచి 2019లో పెండెం దొరబాబు వైసీపీ టికెట్పై విజయం దక్కించుకున్నారు. అయితే.. ప్రజలకు చేరువ కాలేక పోయారని… పార్టీని ముందుండి నడిపించలేక పోయారని పార్టీకి సర్వేలుఅందాయి. దీంతో గతంలోనే ఒకటికి రెండు సార్లు హెచ్చరించారు. అయినా.. పద్ధతి మార్చుకోకపోవడంతోనే ఆయనకు టికెట్ నిరాకరించిన ట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈయన వచ్చే ఎన్నికల్లో జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. టికెట్ ఇస్తే.. గెలిచి గిఫ్ట్‌గా ఇస్తానంటూ.. పవన్‌కు రాయబారం పంపినట్టు తెలిసింది.
జగ్గంపేట: జగ్గంపేట నుంచి 2019లో జ్యోతుల చంటిబాబు విజయం దక్కించుకున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను కూడా పక్కన పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో చంటిబాబు టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో ఎలాంటి షరతులు లేకుండా చేరేందుకు చంటిబాబు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెల 5న చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రత్తిపాడు: ఇక్కడ నుంచి పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయనకు కూడా ఎదురుగాలి వీస్తోంది. దీంతో ఆయనను సైతం వైసీపీ పక్కన పెట్టింది. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కొత్త సంవత్సరంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.