ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలన్నా ప్రణాళిక లేదు.. పార్టీ పుంజుకోవడానికి ఏం చేయాలనే ఆలోచన లేదు.. కానీ ఎన్నికల్లో మాత్రం కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ మాత్రం చేస్తున్నారు. ఇదీ కొంతమంది టీడీపీ నేతల తీరుగా మారిందని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. కుటుంబంలో ఒక్కరికి టికెట్ ఇస్తే సరిపోదని ఈ నాయకులు తెగేసి మరీ చెబుతున్నారని తెలిసింది. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావుకు విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చేలా బాబు ఉన్నారని తెలిసింది. అయితే ఈ ఎంపీ సీటుతో పాటు తన తనయుడికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కళా వెంకటరావు కోరుతున్నారని సమాచారం.
ఇక మరో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా రెండు టికెట్ల కోసం పట్టుబడుతున్నారని టాక్. విజయనగరంలో తనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఏది ఇచ్చినా ఓకే కానీ తన తనయకు కూడా ఓ సీటు ఇవ్వాలన్నది అశోక్ డిమాండ్ గా తెలుస్తోంది. మరోవైపు విశాఖ జిల్లాలో వచ్చే ఏడాది ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమైందనే చెప్పాలి. ఈ సీటు తనకు దక్కిందనే ఆనందం కంటే కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ తన కొడుకు విజయ్ పాత్రుడికి వస్తుందో లేదోననే ఆందోళనే అయ్యన్నపాత్రుడికి ఉందని చెబుతున్నారు.
మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ దేవి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తదితర నాయకులు తమ వారసులకు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. పార్టీలో ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న తమ సీనియారిటీని గుర్తించి టికెట్లు ఇవ్వాలని బాబును కోరుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాల వేటలో ఉన్న బాబు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.