రాజకీయాలంటే అంతే ఈజీ కాదు. ఇందులో నెగ్గుకురావాలంటే తెలివితేటలుంటే సరిపోదు కుళ్లు కుతంత్రాలను ఎదుర్కొనే శక్తి, ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహం, ప్రజలను తిప్పుకునే మాయ కావాల్సిందే. ఇలాంటి నైపుణ్యాలు లేక చాలా మంది రాజకీయాల్లో అడుగుపెట్టినా ఫెయిల్యూర్ గానే మిగిలిపోయారు. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టిన జేడీ లక్ష్మీ నారాయణ భవిష్యత్ ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. చీకట్లో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికే జై భారత్ నేషనల్ పార్టీ పెడుతున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
రాజకీయ పార్టీదేముంది ఎవరైనా పెట్టొచ్చు. పార్టీని నడిపించడమన్నది పార్టీ పెట్టినంత ఈజీ కాదు. ఆరంభంలో అంతా బాగానే ఉందనిపిస్తోంది. ఉత్సాహం ఉంటుంది. కానీ పరిస్థితులు ప్రతికూలంగా మారగానే చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది. రాజకీయాల్లో శుద్ధమైన వాతావరణమే లక్ష్యంగా మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ 2006లో లోక్ సత్తా పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. మొదట 1996లో లోక్ సత్తా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన ఆయన, ఆ తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు. రాజకీయాల్లో ప్రభావం చూపించాలని, సంస్కరణలు తేవాలనే ఆశతో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీ చేసే ఓడిపోయారు. అంతే జేపీ ఇక సైలెంట్ అయిపోయారు. ఆయన పార్టీ కూడా పెద్దగా ఆదరణ పొందడం లేదు. సమకాలీన రాజకీయ, పాలన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించడానికే ఇప్పుడు జేపీ పరిమితమయ్యారు.
జేడీ లక్ష్మీనారాయణ కూడా జేపీగా మిగిలిపోతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలోనే జేడీ పార్టీ పెట్టేలా కనిపించారు. కానీ కొన్ని కారణాల వల్ల జనసేనలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జనసేనను కూడా వీడారు. ఇప్పుడు మరో మూణ్నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేడీ కొత్త పార్టీ పెట్టారు. కానీ ఈ పార్టీ మనుగడ ఎన్ని రోజులన్నదే ఇప్పుడు ప్రశ్న. రాజకీయాల్లో ఆరితేరిన ప్రత్యర్థులను తట్టుకుని పార్టీని ఎక్కడివరకూ జేడీ తీసుకెళ్లగలరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహా అయితే ఎన్నికల్లో జేడీ గెలుస్తారేమో కానీ ఆయన పార్టీకి మాత్రం నిరాశ తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.