పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్.. దేశ రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. 2014లో ప్రధాని మోడీ మొదలు 2019లో సీఎం జగన్ వరకు ఎందరో నేతలకు అధికార పీఠాన్ని దగ్గర చేసిన క్రెడిట్ పీకేది. ఐపాక్ అధినేతగా తన రాజకీయ వ్యూహాలతో కార్పొరేట్ స్థాయిలో పొలిటికల్ స్ట్రాటజీస్ ని అందించడంలో పీకే సిద్ధ హస్తుడు.
గత ఎన్నికలలో ఏపీలో వైసిపి అధికారంలోకి రావడానికి, జగన్ సీఎం కావడానికి పీకే వ్యూహాలు కారణం అనడలంలో అతిశయోక్తి లేదు. అయితే, కొంతకాలంగా టిడిపి తరఫున రాబోయే ఎన్నికలలో పీకే పని చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే తాజాగా గన్నవరం విమానాశ్రయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి పీకే బయటకు వచ్చిన వీడియో వైరల్ గా మారింది.
అంతేకాకుండా, పీకే, లోకేష్ ఇద్దరు ఒకే కారులో కూర్చొని విమానాశ్రయం నుంచి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో ఆ ఇద్దరు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబుతో భేటీ కాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. టిడిపితో పీకే జత కట్టబోతున్నారు అని కొంతకాలంగా పుకార్లు వస్తున్నాయి. తాజా వీడియో దాదాపుగా ఆ విషయాన్ని కన్ఫామ్ చేసినట్లయింది. ప్రస్తుతం ఏపీలో వైసిపికి పీకే శిష్యులు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే టిడిపికి పీకే రాజకీయ వ్యూహకర్తగా అధికారికంగా ప్రకటిస్తే మాత్రం వైసిపికి చిక్కులు తప్పవనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనా తాజాగా పీకేతో లోకేష్ కలిసి వెళ్లిన వైనం జగన్ తో పాటు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఒకవేళ టీడీపీ, పీకే కలిస్తే టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు పీకే ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates