ఇటీవల మినీ మహానాడులో టీడీపీ కొన్ని పథకాలు ప్రకటించింది. వీటిలో ఒకటి.. మహిళలకు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడకైనా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఈ అవకాశం కల్పిస్తామని టీడీపీ తెలిపింది. అయితే.. ఏమనుకున్నారో.. ఏమో వైసీపీ ప్రభుత్వం ఇదే పథకాన్ని చెప్పాపెట్టకుండానే అమలు చేసేందుకు రెడీ అయిపోయింది.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆఘమేఘాలపై అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఆర్టీసీ అధికారులతో సీఎంవో, జీఏడీ అధికారులు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. జనవరిలో.. వీలైతే సంక్రాంతి పండుగ నుంచి దీనిని అమలులోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంపై అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ నిబంధనలతో ఏ టైపు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు? ఉచితం అమలు చేస్తే ఆర్టీసీ రాబడిలో ఎంత తగ్గుతుంది? దానికి ప్రభుత్వం ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందన్న అంశాలపై చర్చిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా.
Gulte Telugu Telugu Political and Movie News Updates