పవన్ కూడా రంగంలోకి దిగారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులను ఫైనల్ చేయటం కోసం కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే సీనియర్ నేతలు, ఆశావహులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో వన్ టు వన్ సమావేశమయ్యారు. శుక్రవారం పార్టీ ఆపీసులో జరిగిన సమీక్షల్లో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని నేతలతో చాలాసేపు మాట్లాడారు. నిజానికి ఇలాంటి సమీక్షలు చేయటంలో ఏమిటి ఉపయోగమో పవన్ కే తెలియాలి.

ఎందుకంటే 175 నియోజకవర్గాల్లోను పార్టీ పోటీచేసేట్లయితే అప్పుడు ప్రతి నియోజకవర్గంలోని నేతలతో వన్ టు వన్ సమావేశం అయితే అర్ధముంది. పోటీచేసేది ఎన్ని సీట్లకో తేలీదు. పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవో తెలీదు. పొత్తులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నిసీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకోవాల్సిందే. సీట్ల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలపై చంద్రబాబు, పవన్ మధ్య అవగాహన కుదిరే ఉంటుందనటంలో సందేహంలేదు. అయితే ఆ విషయం వాళ్ళిద్దరి మధ్య మాత్రమే ఉంటే సరిపోదు.

పోటీచేయాలని ఆశపడుతున్న నేతలకు కూడా తెలియాలి. అయితే వివిధ కారణాల వల్ల అటు చంద్రబాబు ఇటు పవన్ సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ప్రకటించలేదు. అసలు విషయం ప్రకటించకుండా అన్నీ నియోజకవర్గాల నుండి నేతలను, ఆశావహులను పిలిపించి పవన్ సమీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్ధంకావటంలేదు. పోటీచేయబోయే నియోజకవర్గాల్లో మాత్రమే బలమైన నేతలను పవన్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రాతిపదికన నేతలు, ఆశావాహులతో మీటింగులు పెడితే విషయం బయటపడితే పార్టీలో గొడవలవుతాయని పవన్ భయపడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఏదేమైనా సీట్ల సంఖ్య, నియోజకవర్గాల జాబితాను పవన్ ఎప్పటికైనా ప్రకటించాల్సిందే అన్నపుడు అదేదో ఇపుడే చేస్తే సరిపోతుంది కదానే వాదన కూడా పార్టీలో పెరిగిపోతోంది. సీట్ల సంఖ్య, నియోజకవర్గాల పై చివరి నిముషంలో గొడవలు జరిగేకన్నా ఇపుడే జరిగితే కనీసం సర్దుబాటు చేసుకునే సమయం ఉంటుందన్న విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నారు. ఏదేమైనా పవన్ వన్ టు వన్ చేస్తున్న సమీక్షలు అయితే ఇంట్రెస్టింగుగానే ఉన్నాయి.