అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు తాజాగా దాఖలు చేసిన పిటిషన్ సంచలనం రేపుతోంది. లోకేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో లోకేష్ పై చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులు కోరారు.
ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీసు నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని సీఐడీ అధికారులు ఆరోపించారు. అంతేకాదు, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు రాసుకున్నానని లోకేష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు సంచలన ఆరోపణలు చేశారు. అయితే, అందుకు సాక్ష్యాలు చూపించాలని సీఐడీ అధికారులను జడ్జి ప్రశ్నించారు. దీంతో, ఆయా పత్రికల రెడ్ బుక్ కు సంబంధించిన క్లిప్పింగ్‌లను సీబీఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేష్ ను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది.
కాగా, లోకేష్ పై ఏపీ సీఐడీ అధికారులు గతంలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు వ్యవహారంలో లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, లోకేష్ కు 41ఏ నోటీసులిచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే లోకేష్ కు ఆల్రెడీ 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. సీఐడీ అధికారులు ఆయన విచారణకు రావాలని ఆదేశించగా…లోకేష్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.