వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, ఇతర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు.. రాష్ట్రానికి రానున్నారు. జిల్లాల వారిగా పర్యటించనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపైనా దృష్టి పెట్టనున్నారు.
మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో దాదాపు సగం నియోజకవర్గాలపై కేంద్ర ఎన్నికల సంఘం డేగకన్ను సారించనుందని ఏపీ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా ల్లో చోటు చేసుకున్న అవకతవకలు సహా.. ఓటర్ల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు, విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు.. అందించిన కంప్లెయింట్స్.. ఇలా అన్ని విషయాలను కూడా పరిశీలనలోకి తీసుకోనుంది. ఇక, ఎన్నికలకు ముందు కీలకమైన అధికారులను బదిలీ చేయడంపైనా నిషేధం విధించే అవకాశం ఉంది.
ఇప్పటికే కొందరు అధికారులపై విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.ఈ క్రమంలో ఆయా అధికారులు ప్రొఫైళ్లను కూడా ఎన్నికల సంఘం పరిశీలనలోకి తీసుకుంది. ప్రస్తుత పర్యటనలో భాగంగా ఆయా అంశాలపైనా చర్చించి.. అవసరమైతే.. ప్రమోషన్లను(ఇటీవల సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారు) కూడా వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.
ఇక, సమస్యాత్మక ప్రాంతాల్లో .. పోలింగ్ కేంద్రాల నిర్వహణ సహా.. కలెక్టర్ల పనితీరు.. వంటివి గత ఆరు మాసాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సేకరించనుంది. అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోనూ ప్రత్యేకంగా భేటీ అయి చర్చించనున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత కాక పుట్టించడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విపక్షాల విమర్శలు, ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates