రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్లియర్ చేయాల్సిన బిల్సన్నింటినీ పెండింగులో పెట్టమని ఆదేశించినట్లు సమాచారం. అధికారవర్గాల సమాచారం ప్రకారం సుమారు రు. 60 వేల కోట్ల మేరకు బిల్లులు క్లియరెన్సుకు రెడీగా ఉన్నాయి. అయితే కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై రివ్యూలు చేస్తున్న రేవంత్ బిల్లులన్నింటినీ పెండింగులో పెట్టమని చెప్పేశారట. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, జరిగిన పనులను అన్నింటినీ తనఖీ చేసిన తర్వాత కానీ బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకునేదిలేదని రేవంత్ తేల్చి చెప్పేశారట.
నిజానికి ఇపుడు పెండింగులో ఉన్న బిల్లుల్లో చాలావరకు కేసీయార్ ప్రభుత్వంలోనే పెండింగులో ఉన్నాయి. అప్పట్లో కావాలనే కేసీయార్ బిల్లులను క్లియర్ చేయకుండా తొక్కిపెట్టుంచారు. ఇపుడు రివ్యూల్లో రేవంత్ ఇచ్చిన ఆదేశాలతో కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్ధలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇరిగేషన్, రోడ్లుభవనాలు, మౌళిక సదుపాయాల కల్పన కాంట్రాక్టర్ల బిల్లులే ఎక్కువగా పెండింగులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులన్నింటినీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపుకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రేవంత్ చెప్పారు.
జీతాలు, పెన్షన్లకు పోను మిగిలిన నిధులను అత్యవసర వాడకానికి మాత్రమే ఉపయోగించబోతున్నట్లు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులకు రేవంత్ చెప్పారట. తన ఆదేశాలు లేకుండా ఏ కాంట్రాక్టర్, ఏ సంస్ధకు నిధులు విడుదల చేయద్దని ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జరిగిన పనులను రివ్యూచేసిన తర్వాత బిల్లుల చెల్లింపుకు క్లియర్ చేయాలంటే చాలాకాలం పట్టేట్లుంది. అంటే పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం మరో రెండునెలలు పట్టేట్లుందని సమాచారం.
శాఖలవారీగా జరిగిన పనులు, జరిగిన పనుల్లో నాణ్యత, చెల్లించిన బిల్లులు, చెల్లించాల్సిన బిల్లుల వివరాలను రేవంత్ తెప్పించుకుంటున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రతిరోజు సమీక్షలు చేస్తు జరిగిన, జరగాల్సిన పనుల వివరాలను తెలుసుకుంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వాలు మారినపుడల్లా నిర్మాణ సంస్ధలు, కాంట్రాక్టర్లకు ఇలాంటి సమస్యలు తలెత్తటం చాలా సహజమని అందరికీ తెలిసిందే. ప్రతి ప్రభుత్వమూ అప్పుల్లోనే ఉంది కాబట్టే ఉన్న నిధులను అత్యవసర వినియోగానికి మాత్రమే వాడుకోవాలని అనుకుంటున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.