మంగళగిరిలో ఓటమికి కారణం చెప్పిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్నటితో దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబరు 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర పూర్తయిన తర్వాత తన భవిష్యత్ కార్యచరణపై లోకేష్ ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో తన ఓటమికి గల కారణాన్ని లోకేష్ వివరించారు.

ఎన్నికలకు కేవలం 21 రోజుల ముందే మంగళగిరికి వచ్చానని, దీంతో, అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం వీలు కాలేదని చెప్పారు. ఎన్నికలకు ఏడాది ముందే మంగళగిరి వచ్చుంటే ప్రజా సమస్యలు లోకేశ్ కు తెలిసేవని, లోకేశ్ ఏంటో ప్రజలకు తెలిసేదని చెప్పారు. రాజకీయ వారసత్వంతో వచ్చిన తాను టీడీపీకి పెద్దగా పట్టులేని మంగళగిరిని ఛాలెంజింగ్ గా తీసుకొని పోటీ చేశానని అన్నారు.

ఓడిపోయిన క్షణం నుంచి మంగళగిరి ప్రజలకు సేవ చేస్తున్నానని, తన ఫోన్ నంబర్ మంగళగిరిలో చాలామందికి తెలుసని చెప్పారు. ఎవరు ఏ చిన్న మెసేజ్ పెట్టినా యుద్ధ ప్రాతిపదికన వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. ఈ సారి 53 వేల ఓట్ల మెజారిటీతో మంగళగిరి ప్రజలు తనను ఆశీర్వదిస్తారని భావిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తమ గొంతుక వినిపించేందుకు ఏదైనా వేదిక కావాలని యువకులు కోరడంతో యువగళం మొదలైందని చెప్పారు. పాదయాత్ర ప్రారంభించిన 45 రోజులకే యువగళం ఆంధ్రా గళం అయిందని అన్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకున్నానని, స్వయంగా వారి ఇబ్బందులు తెలుసుకున్నానని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని కలిపి అమలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యం అని చెప్పారు.