ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జతకట్టిన జనసేన కలిసి పోటీకి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల లెక్కలు, గెలిచే గుర్రాలు.. వచ్చే లబ్ధి.. పదవులు.. పంపకాలు.. ఇలా అనేక విషయాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఒక లెక్క ఉంది. దానినే ఆయన తరచుగా చెబుతున్నారు. సీట్ల లెక్క ఇంత అని చెప్పకపోయినా.. ఆశలు తగ్గించుకోవాలని, పదవులు ప్రధానం కాదని.. రాష్ట్రం కోసం పనిచేయాలని ఆయన చెబుతున్నారు.
అయితే..ఈ క్రమంలోనే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, కీలక నేత నాగబాబు కూడా తన లెక్కలు వివరించారు. గెలిచే సీట్లపైనా, పొందే పదవులపైనా, అభ్యర్థుల ఎంపికపైనా.. తన వైఖరిని ఆయన విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో ఇరు పార్టీలు కలిసి ఎన్ని సీట్లు గెలవబోతున్నాయనే అంశంపై తన అంచనాల్ని వెల్లడించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీకి 25 సీట్లకు మించి రావని తనదైన శైలిలో భవిష్యత్తును వర్ణించారు.
150 సీట్లతో జనసేన- తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని కూడా నాగబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ హవా తగ్గిపోయిందని.. పలు సర్వేలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయని నాగబాబు వెల్లడించారు. ఆ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతతం నాగబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండి.. పార్టీ నాయకులతో చర్చలు జరపనున్నారు. తాజాగా సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలు, జనసైనికులు, వీరమహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన తనదైన శైలిలో లెక్కలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతోకొంత అభివృద్ధి చేసిన కేసీఆర్ నే ప్రజలు తిరస్కరించారని, అసలు ఏ అభివృద్ధీ చేయని వైసీపీని తుక్కు తుక్కుగా ఓడిస్తారని నాగబాబు జోస్యం చెప్పారు. “వైనాట్ 175 అంటున్న వైసీపీ పార్టీకి 25 సీట్లు వస్తే గొప్పే. 2019 సార్వత్రిక ఎన్నిల్లో జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ వచ్చిందని, వైసీపీ నాయకులు ఈ మధ్య చెబుతున్నారు. జనసేన బలం 12 శాతం వరకు ఉండొచ్చని మాట్లాడారు. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నా.. జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద ప్రజల్లో నమ్మకం పెరిగింది. జనసేనకు 32 నుంచి 35 శాతం వరకు ఓటు శాతం పెరిగింది” అని నాగబాబు పేర్కొన్నారు.
ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అయితే 40 శాతం కంటే ఎక్కువగా ఓటు బ్యాంకు ఉందని నాగబాబు చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ ఘన విజయం సాధించిందని, వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇలా జరగబోదని, రెండు పార్టీలూ ఉమ్మడిగా రంగంలోకి దిగుతున్నాయని.. వైసీపీకి చుక్కలేనని నాగబాబు వ్యాఖ్యానించారు. మరి ఆయన జోస్యం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates