వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్కటిగా టికెట్లను ఖరారు చేస్తున్న వైసీపీలో నాయకులు కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కుతుందో దక్కదోననే ఆవేదన చాలా మంది నాయకుల్లో గూడుకట్టుకుంది. ఇక, కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ టికెట్ల వ్యవహారాన్ని కూడా తేల్చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి మూడు టికెట్లపై వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిఈ విషయాన్ని స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలోని కీలకమైన ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేవని తేల్చి చెప్పేశారు. వీరికి వచ్చే ఎన్నికల్లో సీటు తిరస్కరిస్తున్నట్లు అధిష్టానం తేల్చి చెప్పేసింది. అమరావతికి పిలిపించుకుని పార్టీ పరిశీలకుడు మిథున్ రెడ్డి ఈ విషయాన్ని తేల్చి చెప్పడంతో వారంతా కంగుతిన్నారు. వీరి స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తుందీ చెప్పి మరీ సహకరించాలని కోరారు. దీంతో సదరు స్థానాల నాయకులు వెనుదిరిగారు.
అయితే.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎమ్మెల్యేలు ఫైరయ్యారు. సీఎం జగన్‌ను నేరుగా కలిసి తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు. అధిష్ఠానం సీటును నిరాకరించడంతో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు సమావేశం నిర్వహించారు. తన దారి తాను చూసుకుంటానని చంటిబాబు తన అనుచరులతో వ్యాఖ్యానించారు. మరోపక్క జగ్గంపేట సీటు తనకే ఇస్తున్నారని మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించుకున్నారు.
ఇక, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఆవేదనలోఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతానని.. గతంలోనే తాను హామీ ఇచ్చానని, కానీ, ఏ సర్వేలో ఏముందో కానీ.. తన సీటును తీసేయడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, ప్రతిప్తాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కూడా ఆవేదనలో ఉన్నారు. అయితే, అధిష్టానం చెప్పినట్టే నడుచుకుంటానని.. ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా.. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వరుసగా ప్రజలు మార్పు కోవడం గమనార్హం. బహుశ ఈ నేపథ్యంలోనే వైసీపీ మరోసారి మార్పులు చేసినట్టుగా భావిస్తున్నారు.