టీడీపీ పిలిచి మరీ సీటు ఇస్తానంటోందా?

లగడపాటి రాజగోపాల్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకుడు. 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. ఆంధ్రా ఆక్టోపస్ గా ప్రసిద్ధి చెందిన లగడపాటి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ మరోసారి పొలిటికల్ సర్కిల్లో లగడపాటి పేరు హాట్ టాపిక్ గా మారింది. అతను రాజకీయాల్లోకి పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైందని, టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గెలిచేలా కనిపిస్తున్న అభ్యర్థుల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే లగడపాటి రాజగోపాల్ బాబు కంట్లో పడ్డారనే చెప్పాలి. ఆయన్ని పార్టీలో చేర్చుకుని ఎంపీగా పోటీ చేయించాలని బాబు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు బాబుతో లగడపాటి చాలా సార్లు భేటీ అయ్యారు. 2019లోనూ మరోసారి టీడీపీ గెలుస్తుందని లగడపాటి చేసిన సర్వే బోల్తా కొట్టింది. 2019 ఎన్నికల్లోనే ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. కానీ ఆయన మాత్రం దూరంగానే ఉన్నారు.

కానీ ఈ సారి మాత్రం కచ్చితంగా లగడపాటి పోటీ చేస్తారనే చెబుతున్నారు. లగడపాటి ఎంపీగా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న ముఖ్య అనుచరులు తాజాగా విజయవాడలో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. వీళ్లంతా కలిసి లగడపాటిని తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరారు. మరోవైపు టీడీపీ కీలక నేతలు కూడా లగడపాటితో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. విజయవాడ, గుంటూరు, ఏలూరులో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని లగడపాటికి చెప్పినట్లు టాక్. కానీ విజయవాడ, గుంటూరులో ప్రస్తుతం టీడీపీ ఎంపీలే ఉన్నారు. అయితే కేశినేని నాని, గల్లా జయదేవ్ పై పార్టీలో అసంత్రుప్తి ఉందని తెలుస్తోంది. అందుకే లగడపాటికి ఈ పార్లమెంట్ నియోజకవర్గాలను బాబు ఆఫర్ చేసినట్లు సమాచారం. లగడపాటి మాత్రం ఏలూరులో తన విజయ అవకాశాలపై సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏలూరు నుంచి టీడీపీ తరపున లగడపాటి పోటీ చేయడం ఖాయమనే చెప్పాలి.