కేటీఆర్‌, రేవంత్ ఇద్దరూ తగ్గట్లేదుగా

తెలంగాణ అసెంబ్లీలో ఫైర్ గేమ్ న‌డుస్తోంది. అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నా యి. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మాట‌లు గుప్పించారు. కేటీఆర్‌ను ఎన్నారై అంటూ.. సంబోధించారు. ఎన్నారైల‌కు ఏం తెలుసు.. రాష్ట్ర స‌మ‌స్య‌లు అంటూ వ్యాఖ్యానించారు.

“గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలంగాణ పక్షమే.. కాంగ్రెస్ ఎప్పటికీ విపక్షమే” అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రేవంత్ మండిపడ్డారు. కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ సంబోధించారు. “కొంతమంది ఎన్ఆర్ఐ‌లకు ప్రజాస్వామ్యం గురించి చెప్పినా అర్థం కాదు. అచ్చోసిన ఆంబోతులా పోడియంకు వస్తాం అంటే సరికాదు. పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టినరోజు మాట్లాడిన నాయకుడు పీజేఆర్ మా నేత” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని, కేకే మహేందర్ రెడ్డి టికెట్ గుంజుకుని.. ఆయ‌న‌కు అన్యాయం చేశారన్నారు. గత పాలన గూర్చి మాట్లదుడామంటే ఒక రోజంతా చర్చ పెడదామన్నారు. గత పాలనలో పాపం ఉందంటే ఆనాటి పాలకుల్లో చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా అవకాశం ఇచ్చింది, సింగిల్ విండో ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఇచ్చింది, కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేన‌ని రేవంత్ చెప్పారు.

ప్రతి పక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఈ స‌మ‌యంలో కేటీఆర్ కూడా అదే రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. చీమ‌లు పెట్టిన పుట్ట‌లో జొర‌ప‌డింది రేవంతేన‌ని చెప్పారు. తెలంగాణ బ‌లి దేవ‌త ఎవ‌రో తెలుసున‌ని, ఈ మాట అన్న‌దెవ‌రో కూడా స‌మాజానికి తెలుస‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం.. విమ‌ర్శ‌లు చోటు చేసుకున్నారు. ఓ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌.. నిర్మాణాత్మ‌క చ‌ర్చ‌ల‌కు మాత్ర‌మే అసెంబ్లీ వేదిక‌గా ఉంద‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి స‌భ‌లో వాగ్యుద్ధాలు.. వార్ ఫైర్‌గా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.