అప్పులనే చూస్తున్నారు.. ఆస్తులు చూడరా..

తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. సభ్యుడిగా దీనికి తాను సిగ్గు పడుతున్నానన్నారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారి మీద నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. దీన్ని తాను ఖండిస్తున్నానన్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ప్ర‌సంగానికి ధ‌న్వవాదాలు తెలిపే తీర్మానం సంబ‌ర్ధంగా శ‌నివారం ఆయ‌న ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌.. గ‌త పాల‌న‌పై లేనిపోని అభాండాలు వేస్తున్నార‌ని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో ఒక్కటి కూడా వాస్తవం లేదన్నారు. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే… అలాగే తెలంగాణ పక్షమేనన్నారు.. కాంగ్రెస్ ఎప్పటికీ విపక్షమేనని చెప్పారు. కేటీఆర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పాలన పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ స‌మ‌యంలో కొంత గంద‌ర‌గోళం చోటు చేసుకుంది. త‌ర్వాత‌.. మ‌ళ్లీ స‌భలో కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ విష‌యాన్ని కూడా రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అప్పులతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చింద‌ని.. కానీ, తాము రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి అప్ప‌గిస్తున్నామ‌న్నారు. విద్యుత్ సంస్థ‌లకు భారీగా ఆస్తులు ఉన్నాయ‌ని కేటీఆర్ చెప్పారు. అప్పుల‌ను బూత‌ద్దంలో చూపిస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు విద్యుత్ సంస్థ‌ల ఆస్తుల‌ను చూడ‌డం లేద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

“వాస్తవానికి ప్ర‌స్తుత కాంగ్రెస్‌ ప్ర‌భుత్వానికి మూడు మాసాల గ‌డువు ఇవ్వాల‌ని కేసీఆర్ అనుకున్నారు. కానీ, వీరి వ్య‌వ‌హార శైలి చూసిన త‌ర్వాత ఆ మాత్రం స‌మ‌యం కూడా ఇవ్వాల‌ని అనిపించ‌డం లేదు” అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ మంత్రులు అబ‌ద్ధాలు, అస‌త్యాలు చెబితే ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2014కు ముందు అన్యాయం జ‌రిగింద‌నే తెలంగాణ కోసం ఉద్య‌మించామ‌ని, 50 ఏండ్ల తెలంగాణ పాల‌న‌లో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందేన‌ని చెప్పారు. అయితే, కేటీఆర్ ప్ర‌సంగం సాగుతున్న స‌మ‌యంలో మంత్రులు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.