వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం.. నాయకులు జిల్లాలు సైతం మారిపోతున్నారు. కొందరు నియోజకవర్గాలను మారుతుంటే.. ఇప్పుడు ఉన్న పోటీ నేపథ్యంలో మరికొందరు జిల్లాలను కూడా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో టీడీపీ, వైసీపీ నాయకుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా టీడీపీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. తాడికొండ ప్రస్తుత ఎమ్మెల్యే.. వైసీపీ రెబల్ నాయకురాలు.. ఉండవల్లి శ్రీదేవి.. తిరువూరు నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీదేవి 2014 ఎన్నికల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంతకుముందు.. ఆమె కుటుంబం కూడా రాజకీయాలు చేసింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉండవల్లి.. విజయం దక్కించుకున్నారు. అయితే, తర్వాత పరిణామాల నేపథ్యంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి అనుకూలంగా ఓటేశారనే ఆరోపణలు వచ్చాయి.
దీంతో వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక, ఆ తర్వాత ఆమె నేరుగా టీడీపీకి మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన ఆందోళన ల్లోనూ ఆమె పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. అయితే, ఆమె తాడికొండ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. ఇక్కడ తెనాలి శ్రావణ్‌కుమార్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అయింది.
దీంతో ఈ సీటు విషయంలో శ్రీదేవికి నిరాసే ఎదురైంది. అయితే, ఆమెకు ఉన్న చరిష్మా నేపథ్యానికి తోడు మహిళా సెంటిమెంటు, ఉన్నత విద్యావంతురాలనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ఆమెను ఉమ్మడి కృష్ణాజిల్లాలోని తిరువూరు కు నామినేట్ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడ అయితే, ఆమె గెలుపునకు అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడి కీలక నాయకుడు నల్లగట్ల స్వామిదాసును ఒప్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న దేవదత్ కూడా పార్టీని పటిష్టం చేయలేకపోతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక ఇక్కడ శ్రీదేవిని రంగంలోకి దింపితే అసంతృప్తి లేవకుండా ఉండే బాధ్యతను మాజీ మంత్రి దేవినేని ఉమకు అప్పగించారని.. ఎమ్మెల్సీ సీటు ఇచ్చే ప్రతిపాదన ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.