టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన పిలుపునిచ్చారు. అధికార పార్టీ వైసీపీని మునుగుతున్న నావతో పోల్చారు. ఆ పార్టీలో ఉన్న నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగానే జాగ్రత్త పడాలని ఆయన పిలుపునిచ్చారు. “చేతులు కాలాక.. నిండా మునిగాక బాధపడి ప్రయోజనం లేదు. ముందుగానే మేల్కొనండి. మీ దారి మీరు చూసుకోండి. ధైర్యం చేయండి” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నావకు చిల్లు పడిందన్న ఆయన దాని నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నాయకులు కూడా బయటపడే పరిస్థితి లేదన్నారు. దూకి పారిపోతేనే ప్రాణాలు కాపాడుకుంటారని, లేకపోతే కొట్టుకుపోతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఇప్పటికే వైసీపీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు తమ అనుచరులతో టీడీపీలో చేరిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీని మునిగిపోతున్న నావగా పేర్కొనడం గమనార్హం. “రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతుంది. ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది. వారితో విభేదించారనే నెపంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో టార్చర్ చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం?” అని ప్రశ్నించారు.
జగన్ అన్ని సంప్రదాయాలను సర్వనాశనం చేశారని చంద్రబాబు ఫైరయ్యారు. అధికారంలోకి వచ్చాక జగన్ ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడారా? కనీసం మీడియాతో అయినా.. మాట్లాడారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారంటూ.. వలంటీర్ వ్యవస్థపై నిప్పులు చెరిగారు. “ఎన్నికలకు ముందు ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు. జగన్ ఒక అపరిచితుడు. చెప్పింది ఒక్కటీ చేయడు. తల్లికి, చెల్లికి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడు” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ఇప్పుడు 11 మంది ఇన్‌ఛార్జిలను మార్చారని, రాబోయే కొద్ది వారాల్లోనే 151 మందిని మార్చినా రాష్ట్రంలో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు దుయ్యబట్టారు.
వెనుకబడిన వర్గాలను బలపరిస్తేనే సామాజిక న్యాయం దక్కుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్.. కేంద్రం మెడలు వంచలేదు కానీ.. తన మెడలు ఒంచుకున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం పనులు తన హయాంలోనే 72శాతం పూర్తయ్యాయని చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్లమని చెప్పారు. ఇప్పుడు.. అసలు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు అవుతుందని చంద్రబాబు చెప్పారు.