కేసీఆర్ భ‌ద్ర‌త‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ‌లో 10 సంవ‌త్స‌రాలు పాల‌న సాగించిన‌.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు భ‌ద్ర‌త త‌గ్గించాల‌ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి కేసీఆర్‌కు ఎలాంటి హెచ్చ‌రిక‌లూ లేవు. గ‌తంలో కొంత మేర‌కు మావోయిస్టుల ప్ర‌భావం ఉన్నా.. ఇప్పుడు ఆ ప్ర‌బావం కూడా లేక‌పోవ‌డంతో.. కేసీఆర్ ఎలాంటి హెచ్చ‌రికల జాబితాలో కూడా లేర‌ని ఆ పార్టీనే కొన్నాళ్ల కింద‌ట(ఎన్నిక‌ల‌కు ముందు) ప్ర‌క‌టించుకుంది.

అయితే.. స‌హ‌జంలోనే స‌మాజంలో మారిన ప్ర‌బుత్వం ప‌ట్ల అసంతృప్తి ఉంటుంది కాబ‌ట్టి.. మాజీ సీఎంగా ఆయ‌న‌కు ఇవ్వాల్సిన గౌర‌వం, ప్రొటోకాల్ ప్ర‌కారం భ‌ద్ర‌త వంటివి కొన‌సాగుతాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న Z+ కేట‌గిరి భ‌ద్ర‌త‌ను Y కేట‌గిరిగా మార్చాల‌ని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ణ‌యించినట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబందించి కేంద్ర హోం శాఖ నుంచి కూడా అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక‌, Z+ కేట‌గిరి భ‌ద్ర‌త‌ను Y కేట‌గిరిగా మార్చితే.. కేసీఆర్ భ‌ద్ర‌త‌కు 4+4 సిబ్బందినే వినియోగిస్తారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు డీఎస్పీ స్థాయి అధికారి.. కేసీఆర్ భ‌ద్ర‌త‌కు ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 4+4కు మారితో సీఐ స్థాయి అధికారికే ప‌రిమితం అవుతారు. ఇక‌, కేసీఆర్ ఇంటి వ‌ద్ద సెంట్రీ య‌థాత‌థంగా ఉన్నా.. ఇక్క‌డ కూడా.. 12 నుంచి 8 మందికి సిబ్బందిని త‌గ్గిస్తారు. అదేవిధంగా ఆయ‌న కాన్వాయ్‌లో రెండు పోలీసు వాహ‌నాలు మాత్ర‌మే ఉంటాయి.

అయితే.. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ వివ‌ర‌ణ ప్ర‌కారం.. ఇవ‌న్నీ. కూడా హైద‌రాబాద్‌కే ప‌రిమితం కానున్నాయి. ఆయ‌న పొరుగు రాష్ట్రం లేదా.. ఏదైనా న‌క్స‌ల్ ఎఫెక్టెడ్ జిల్లాల‌కు వెళ్లాల‌ని అనుకుంటే.. ప్ర‌త్యేక భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తారు. ఆ జిల్లా సిబ్బందితోపాటు.. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ఉన్న భ‌ద్ర‌త‌ను రెట్టింపు చేయ‌నున్నారు. హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం Y కేట‌గిరి భ‌ద్ర‌త ఇవ్వ‌నున్నారు.