ప‌వ‌న్ ఈ స్పీడ్ చాల‌దు..

ప‌వ‌న్ ఎంట్రీ ఇస్తేనే.. నాయ‌కులు క‌దులుతున్నారు. నాదెండ్ల మాట్లాడితేనే మైకులు మోగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌ను ప‌రిశీలిస్తే.. ఇదే ప‌రిణామం, ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌డుతోంది. ఈ ఇద్ద‌రు మౌనంగా ఉంటే.. ఇక‌, పార్టీ ఉందో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగున్న‌రేళ్ల‌కు పైగానే స‌మ‌యం గ‌డిచిపోయింది.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కుముందు.. పార్టీని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని.. పార్టీ పేరు అన్ని చోట్లా వినిపించేలా.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేయాల‌నేది పార్టీ ఇప్పుడు నిర్ణ‌యించుకున్న కీల‌క ల‌క్ష్యం. ఈ నేప‌థ్యంలోనే నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. తాజాగా విశాఖలో ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వ్య‌వ‌హారంపై పోరాటం చేసి అరెస్టు కూడా అయ్యారు.

ఇది కొంత‌మేర‌కు పార్టీకి బూస్టు తెచ్చింది. అయితే.. ఇది చాల‌ద‌ని.. ఇంకా దూకుడు పెంచాల‌నేది పార్టీలో జ‌రుగుతున్న అంత‌ర్గ‌త చ‌ర్చ‌. న‌గ‌రాల వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో పార్టీ గురించిన ప్ర‌చారం మంద‌కొడిగా జ‌రుగుతోంది. మ‌రో వైపు, ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అయింది. దీనిని దృష్టిలో పెట్టుకుంటే.. పార్టీ చాలా దూకుడుగా ముందుకు వెళ్లాలి అని కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు.

ఈ విష‌యం నేరుగా ఆయ‌న ప‌వ‌న్‌తో చెప్పార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఇమేజ్‌పైనే పార్టీ ముందుకు న‌డుస్తోంది. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యానికి లోక‌ల్ నేత‌ల ఇమేజ్‌ను కూడా పెంచే ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంద‌ని.. ఆ దిశ‌గా అడుగులు వేయాలంటే.. మ‌రింత జోరు పెంచాల‌నేది ఒక చ‌ర్చ‌. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త మాత్ర‌మే స‌రిపోద‌ని.. పార్టీ ప‌రంగా కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల్సి ఉంటుంద‌నేది ముఖ్య‌మైన అంశం. దీనిపైనే రాబోయే రోజుల్లో మ‌రింత వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించారు. మ‌రి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.