చీరాల హోరు మామూలుగా ఉండేలా లేదే..!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా ఎన్నిక‌ల పోరు మామూలుగా ఉండేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తానికి భిన్నంగా ఇక్క‌డ రాజ‌కీయాలు తెర‌మీదికి రావ‌డం.. నాయ‌కులు మార‌డంతో పోరు తీవ్రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. టీడీపీ ఇక్క‌డి టికెట్‌ను జ‌న‌సేన‌కు త్యాగం చేసింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో చీరాలపై అంచ‌నాలు మ‌రింత పెరుగుతున్నాయి.

ఇక‌, వైసీపీ కూడా యువ నాయ‌కుడికి టికెట్ ఇవ్వ‌డం ఖాయ‌మైంద‌ని అంటున్నారు. దీంతో ప్ర‌కాశం జిల్లా లో చీరాల నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల జ‌న‌సేన‌లో చేరిన ఆమంచి స్వాములుకు ఈ టికెట్ కేటాయించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయ‌న ఇక్క‌డ మాస్ నాయ‌కుడిగా రంగంలోకి దిగుతున్నారు. ఇదే ఆయ‌న తొలిసారి రంగంలోకి దిగుతున్న స్థానం కావ‌డంతో మాస్ జ‌నాలు ఆయ‌న‌కే జై కొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

పైగా.. ఆర్థికంగానూ స్వాములుకు సాయం చేసేందుకు ప‌లు వ‌ర్గాలు రెడీగా ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు వైసీపీ ఇక్క‌డి ఎమ్మెల్యే క‌రణం బ‌ల‌రాం కుమారుడు వెంక‌టేష్‌కు చీరాల టికెట్ ను ఇటీవ‌ల క‌న్ఫ‌ర్మ్ చేసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో యువ నాయ‌కుడిగా వెంక‌టేష్‌కు ఇది మంచి ఛాన్స్‌గా భావిస్తున్నారు. దీంతో త‌న కుమారుడిని ఎమ్మెల్యేగా చూసుకోవాల‌ని బ‌ల‌రాం కూడా త‌పిస్తున్నారు.

దీంతో అటు స్వాములు, ఇటు వెంక‌టేష్‌(టికెట్లు ఇస్తే)ల మ‌ధ్య పోరు హోరాహోరీగా సాగుతుంద‌నే ప్ర‌చారం ఉంది. అయితే.. క‌ర‌ణం పార్టీ మారి(టీడీపీలో గెలిచి వైసీపీకి)న నేప‌థ్యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. ఆయ‌న‌కు డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఇక‌, వైసీపీలోనూ ఆమంచి వ‌ర్గ‌మే ఉన్న నేప‌థ్యంలో వారు కూడా.. క‌ర‌ణం కుమారుడికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం క‌ష్ట‌మే. దీంతో స్వాములు గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.